స్నేహ్‌ రానా కోచ్‌పై పోక్సో కేసు; చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం

Sneh Rana Coach Narendra Shah Booked Under POCSO Act After Leaked Audio - Sakshi

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ స్నేహ్ రానా కోచ్ న‌రేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు న‌మోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్న‌ట్టు ఆడియో ఆధారం ల‌భించ‌డంతో అత‌డిపై ఉత్త‌రాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఆడియో లీక్ విష‌యం తెలియ‌గానే నరేంద్ర ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్‌ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైన‌ర్ యువతి చ‌దువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్ష‌ణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా న‌రేంద్ర సదరు యువతితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్‌లో అస‌భ్య‌క‌రంగా మాట్లాడిన ఆడియో క్లిప్‌ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ ఆడియో వైర‌ల్ కావ‌డంతో అత‌డిపై పోక్సో చ‌ట్టం, ఐపీసీ సెక్ష‌న్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కేసు బుక్ చేశామ‌ని నెహ్రూ కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ఇంఛార్జ్ లోకేంద్ర బ‌హుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశామ‌ని ఆయ‌న వెల్ల‌డించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ప్ర‌స్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న న‌రేంద్ర షా ఉత్త‌రాఖండ్ క్రికెట్ సంఘం మాజీ స‌భ్యుడు. న‌రేంద్రపై పోక్సో కేసు న‌మోదైనట్లు తెలుసుకున్న ఉత్త‌రాఖండ్ క్రికెట్ అసోసియేష‌న్ అత‌డిని ప‌ద‌వి నుంచి తొల‌గించింది. 

టీమిండియా మహిళా క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్‌ రానా ఇటీవలే వుమెన్స్‌ ఐపీఎల్‌ తొలి సీజన్‌ ఆడింది. గుజరాత్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్‌ కెప్టెన్‌ బెత్‌ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజ‌యాలు మాత్ర‌మే సాధించిన గుజ‌రాత్ ప్లే ఆఫ్స్‌కు చేర‌లేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియ‌న్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫైన‌ల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవ‌ర్ బ్రంట్ అర్ధ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో ఆ జ‌ట్టు తొలి సీజ‌న్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.

చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్‌ కేసులో క్రికెటర్‌కు ఊరట

'నెట్‌ బౌలర్‌గా ఆఫర్‌.. బోర్డు పరీక్షలను స్కిప్‌ చేశా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top