
టీమిండియా ఆటగాడు, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (మియా భాయ్) ఈ ఏడాది టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన సిరాజ్.. ప్రస్తుతం స్వదేశంలో విండీస్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోనూ అదే తరహా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు.
ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన మియా.. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో తన మూడో వికెట్ (షాయ్ హోప్) తీసిన అనంతరం సిరాజ్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ వికెట్‌తో సిరాజ్ ఈ ఏడాది (2025) టెస్ట్‌ల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 37 వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డు సాధించే క్రమంలో సిరాజ్ జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని (26) అధిగమించాడు. సిరాజ్, ముజరబానీ తర్వాత ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా మిచెల్ స్టార్క్ (29), నాథన్ లియోన్ (24) ఉన్నారు.
భారత్-విండీస్ రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విండీస్ ఫాలో ఆన్ ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. తొలుత జాన్ క్యాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్‌ను ఉంచారు.
గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు