'మొన్ననే కదా ఫైనల్‌ చేరారు.. అంత మాట ఎలా అంటావు!'

Shoaib Akhtar Slams T20 World Cup Squad Selection May-Return 1st Round - Sakshi

పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పీసీబీ సెలెక్టర్లపై మండిపడ్డాడు. టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన పాక్‌ జట్టు పరమ చెత్తగా ఉందని.. ఇలా అయితే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరుగుతుందంటూ పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈ గురువారం ప్రకటించారు. బాబర్‌ ఆజం కెప్టెన్‌ కాగా.. షాదాబ్‌ ఖాన్‌ వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది తిరిగి జట్టులోకి రాగా.. చాలాకాలం తర్వాత హైదర్‌ అలీ జ్టుటలో చోటు సంపాదించాడు. అయితే ఆశ్చర్యంగా ఫఖర్‌ జమాన్‌ను రిజ్వర్‌ జాబితాలో చోటు కల్పించింది. ఇక సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌కు సెలక్టర్లు మరో సారి మొండి చేయి చూపించారు. ఇక ఆసియా కప్‌  ఫైనల్‌ ఆడిన జట్టులోని ఆటగాళ్లంతా టి20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యారు.

కాగా జట్టు ఎంపికపై షోయబ్‌ అక్తర్‌ స్పందిస్తూ.. ''టి20 ప్రపంచకప్‌కు ప్రకటించిన పాకిస్తాన్‌ జట్టు సమతుల్యంగా లేదు. ముఖ్యంగా మిడిలార్డర్‌ చాలా వీక్‌గా కనిపిస్తోంది. ఇలాంటి మిడిలార్డర్‌ ఉంటే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం గ్యారంటీ. మిడిలార్డర్‌లో సమర్థుల అవసరం ఉంది.. బ్యాటింగ్‌ డెప్త్‌ పెంచాల్సిందే. ఇది సాధ్యం కాకపోతే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఒక్కో మ్యాచ్‌ గెలవడానికి కష్టపడాల్సిందే. అలా జరగకూడదని కోరుకుంటున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అక్తర్‌ వ్యాఖ్యలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. ''మొన్ననే కదా ఆసియాకప్‌లో ఫైనల్‌ వరకు చేరారు.. అంత మాట ఎలా అంటావు అక్తర్‌''.. ''మిడిలార్డర్‌ కాదు.. ముందు బాబర్‌ ఆజంను కెప్టెన్సీ నుంచి తీసేయాలి.. అప్పుడే టీం బాగా ఆడుతుంది.'' అంటూ పేర్కొన్నారు.

ఇక టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్‌-2లో ఉన్న పాకిస్తాన్‌ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్‌ 23న(ఆదివారం) ఆడనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది.

టి20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టు: బాబర్‌ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్

రిజర్వ్‌ ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ

చదవండి: క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉసేన్‌ బోల్ట్‌

కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top