Shikhar Dhawan Da One Sports: స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన టీమిండియా కెప్టెన్‌

Shikhar Dhawan Establishes Sports Academy And Center Of Excellence - Sakshi

టీమిండియా పార్ట్‌ టైమ్‌ వన్డే కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ నిన్న (ఆగస్ట్‌ 5) ఢిల్లీలో స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు. క్షేత్ర స్థాయి క్రీడాకారుల్లో నైపుణ్యాలను కనుగొని, వారిని ఆయా విభాగాల్లో మరింత రాటుదేల్చాలనే ధ్యేయంతో ఈ అకాడమీని నెలకొల్పుతున్నట్లు ధవన్‌ తెలిపాడు. ఈ అకాడమీకి 'డా వన్‌' అనే పేరును ఖరారు చేశాడు. క్రికెట్‌తో పాటు మరో 8 క్రీడాంశాల్లో క్రీడాకారులకు ఈ అకాడమీ శిక్షణ ఇవ్వనుందని తెలిపాడు. 

ఈ అకాడమీలో క్రీడాకారులతో పాటు కోచ్‌లకు కూడా శిక్షణ ఉంటుందని పేర్కొన్నాడు. కోచ్‌లు క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇచ్చేలా సానబెడతామని అన్నాడు. దేశవ్యాప్తంగా ఉత్తమ కోచ్‌లను ఎంపిక చేసి డా వన్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తామని వివరించాడు. క్రికెట్ నాకెంతో ఇచ్చింది.. అందుకు తనవంతుగా క్రీడలకు వీలైనంత సాయం చేయాలని భావిస్తున్నానని తెలిపాడు. 

ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో వన్డేల్లో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న శిఖర్‌ ధవన్‌.. త్వరలో జింబాబ్వేలో వన్డే సిరీస్ కూడా కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో లేని సమయంలో శ్రీలంక, వెస్టిండీస్‌ పర్యటనల్లో భారత్‌కు అద్భుతమైన విజయాలు అందించిన ధవన్‌.. జింబాబ్వేతో సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి రెగ్యులర్‌ వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావిస్తున్నాడు. 

ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్‌ అనే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్న నేపథ్యంలో ధవన్‌ కెప్టెన్సీ అంశం ఆసక్తికరంగా మారింది. ధవన్‌ సైతం తనను టీ20లకు పరిగణలోకి తీసుకోకపోవడంపై పెద్దగా స్పందించకపోవడం చూస్తుంటే అతను మున్ముందు వన్డే ఫార్మాట్‌కు (కెప్టెన్‌గా) మాత్రమే పరిమితమవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

జింబాబ్వే పర్యటన వివరాలు..
తొలి వన్డే ఆగస్టు 18
రెండో వన్డే ఆగస్ట్‌ 20 
మూడో వన్డే ఆగస్ట్‌ 22 

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ 
చదవండి: ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top