శరత్‌ కమల్‌కు అరుదైన గౌరవం.. భారత్‌ తరఫున తొలి ఆటగాడిగా..!

Sharath Kamal First Indian Elected To ITTF Athletic Commission - Sakshi

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డీ ఆచంట శరత్‌ కమల్‌ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీటీఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో శరత్‌ కమల్‌కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శరత్‌ కావడం విశేషం. 2022–2026 మధ్య నాలుగేళ్ల కాలానికిగాను వేర్వేరు ఖండాల నుంచి ఎనిమిది మందిని (నలుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఇందులోకి ఎంపిక చేశారు.

మొత్తం 283 మంది అథ్లెట్లు ఓటింగ్‌లో పాల్గొనగా, ఆసియా ఖండం ప్రతినిధిగా శరత్‌కు 187 ఓట్లు లభించాయి.  మహిళల కేటగిరీలో ఎంపికైన చైనా ప్యాడ్లర్‌ ల్యూ షీవెన్‌కు 153 ఓట్లు మాత్రమే వచ్చాయి. తనకు లభించిన ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శరత్‌ కమల్‌...ఆసియా ఖండం నుంచి తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌ 3 స్వర్ణాలు నెగ్గాడు.  

నేటి నుంచి ఏషియన్‌ కప్‌... 
బ్యాంకాక్‌ వేదికగా నేటినుంచి ఐటీటీఎఫ్‌–ఏటీటీయూ ఏషియన్‌ కప్‌ టోర్నీలో శరత్‌ కమల్‌తో పాటు మరో భారత టాప్‌ ఆటగాడు సత్యన్‌ పాల్గొంటున్నారు. అయితే వీరిద్దరికీ కఠిన ‘డ్రా’ ఎదురైంది. తొలి పోరులో తమకంటే మెరుగైన ర్యాంక్‌ల్లో ఉన్న చువాంగ్‌ చి యువానా (చైనీస్‌ తైపీ)తో శరత్‌ తలపడనుండగా, యుకియా ఉడా (జపాన్‌)ను సత్యన్‌ ఎదుర్కొంటాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top