‘టీ20ల్లో ఆ మార్పు చేసి చూడండి.. అదిరిపోద్ది’

Shane Warne Suggests Unique Change In T20s - Sakshi

సౌతాంప్టన్‌:  ఇప్పటివరకూ టీ20 ఫార్మాట్‌లో బ్యాట్స్‌మన్‌దే ఆధిపత్యం అనేది ఒప్పుకోక తప్పదు. బ్యాటింగ్‌కు బౌలింగ్‌కు సమతూకం రావాలంటే ఒక్క మార్పు కచ్చితంగా చేయాలని అంటున్నాడు ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌. టీ20 ఫార్మాట్‌లో ఒక బౌలర్‌ గరిష్టంగా నాలుగు ఓవర్లు వేసే నిబంధనను మార్చాలని అంటున్నాడు వార్న్‌. ఒక్కో బౌలర్‌ ఐదు ఓవర్లు వేస్తే బ్యాటింగ్‌, బౌలింగ్‌ల మధ్య పోరు సమానంగా ఉంటుందన్నాడు. ‘ బౌలర్లను కుదించండి. ఐదు బౌలర్లతో 20 ఓవర్ల కోటాను పూర్తి చేసే బదులు నలుగురు బౌలర్లతో ఐదేసి ఓవర్లు వేయించండి. ఈ మార్పు చేసి చూడండి.. పోరు మజాగా ఉంటుంది. ఒక బౌలర్‌ ఐదు ఓవర్లు వేయడాన్ని టీ20ల్లో చూడాలనుకుంటున్నా. మీ జట్టులో ఎనిమిది మంది బౌలింగ్‌ చేసే వారు ఉండవచ్చు.. కానీ బౌలర్‌ ఓవర్ల కోటాను పెంచడంతో బ్యాట్స్‌మెన్‌-బౌలర్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది.  (చదవండి: విజిల్‌ పోడు.. నెట్‌,సెట్‌, గో!)

మధ్య ఓవర్లలో ఆదిల్‌ రషీద్‌ వంటి స్పిన్నర్‌ ఐదు ఓవర్లు వేయగలడు. ఇలా ఒక స్పిన్నర్‌ ఐదు ఓవర్లు వేయడం వల్ల అది స్పిన్‌కు బ్యాట్స్‌మెన్‌కు మంచి పోరులా ఉంటుంది. అదే సమయంలో మీరు మ్యాచ్‌ ప్రారంభంతో పాటు చివరిలో మీ త్వరతగతిన బౌలింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇది బిట్స్‌ అండ్‌ పీస్‌కు చెరమగీతం పాడినట్లు అవుతుంది. ఇక జట్టును ఎన్నుకునేటప్పుడు ఉత్తమ బ్యాట్స్‌మన్‌, ఉత్తమ బౌలర్లను ఎంచుకోవడానికి మార్గం మరింత సులభతరం అవుతుంది’ అని వార్న్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి కామెంటరీ చెప్పే క్రమంలో స్కై స్పోర్ట్స్‌ క్రికెట్‌తో మాట్లాడిన  వార్న్‌ పేర్కొన్నాడు.  ఆదివారం జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. తద్వారా సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది.  ఆపై లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 18.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. (చదవండి: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌.. సక్సెస్‌ ఫియర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top