ఓపెనర్ల శతకాలు.. చారిత్రక విజయం సాధించిన పాక్‌ | Shamas, Feroza hit tons as Pakistan win big to clinch ODI series vs Zimbabwe | Sakshi
Sakshi News home page

ఓపెనర్ల శతకాలు.. చారిత్రక విజయం సాధించిన పాక్‌

May 7 2026 9:57 AM | Updated on May 7 2026 10:01 AM

Shamas, Feroza hit tons as Pakistan win big to clinch ODI series vs Zimbabwe

మహిళల క్రికెట్‌లో పాకిస్తాన్‌ అద్భుత విజయం సాధించింది. స్వదేశంలో జరిగిన వన్డేలో పసికూన జింబాబ్వేపై 206 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్‌ మహిళల క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ గెలుపుతో పాక్‌ సిరీస్‌ను కూడా కైవసం​ చేసుకుంది.

జింబాబ్వే తొలిసారి పాక్‌లో పర్యటిస్తున్న చారిత్రక సిరీస్‌ ఇది. ఈ పర్యటనలో జింబాబ్వే 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డే ఇది. అంతకుముందు తొలి వన్డేలోనూ పాకిస్తానే​ విజయం సాధించింది (168 పరుగుల తేడాతో). ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం​ చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే కరాచీ వేదికగా మే 9న జరుగనుంది. అనంతరం 12, 14, 15 తేదీల్లో ఇదే కరాచీ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి.

ఓపెనర్ల శతకాలు
తాజా వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు సదాఫ్‌ షమాస్‌ (101), గుల్‌ ఫెరోజా (100) సెంచరీలతో కదంతొక్కారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సిద్రా అమీన్‌ (59 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా 25, ఆలియా రియాజ్‌ 27, అయేషా జాఫర్‌ 18 (నాటౌట్‌) పరుగులు చేశారు.

కుప్పకూలిన జింబాబ్వే
భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 137 పరుగులకే ఆలౌటైంది. ఫాతిమా సనా (6-0-15-3), మొమినా రియాసత్‌ (8-0-39-2), రమీన్‌ షమీమ్‌ (8-2-20-2), సయ్యదా అరూబ్‌ షా (6-1-18-2), డయానా బేగ్‌ (7-1-23-1) జింబాబ్వే పతనాన్ని శాశించారు. ఆ జట్టు తరఫున కెలిస్‌ (32), బిజా (29), పసిపనోద్యా (33 నాటౌట్‌), లిండోకుహ్లే (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement