అంపైర్‌ ఔటివ్వలేదని వికెట్లు పీకి పాడేసిన స్టార్‌ క్రికెటర్‌..

Shakib Al Hasan Kicks And Throws Stumps After Arguing With Umpire - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రికెట్ సమాజం తలదించుకునే పని చేశాడు. అంపైర్ ఔటివ్వలేదని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ అతనిపైకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో భాగంగా అబహాని లిమిటెడ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్‌ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న షకీబ్ అల్ హసన్.. అంపైర్‌ నిర్ణయం పట్ల అసహనానికి లోనై వికెట్లను తన్నడంతో పాటు అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. 

వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షకీబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహాని లిమిటెడ్ జట్టు ఆచితూచి ఆడుతున్న క్రమంలో, షకీబ్ ఐదో ఓవర్ బౌల్‌ చేశాడు. ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను అబహాని బ్యాట్స్‌మెన్‌ ముష్ఫికర్ వరుసగా సిక్స్‌, ఫోర్ బాదాడు. అయితే, ఆ మరుసటి బంతి ముష్ఫికర్‌ బ్యాట్‌ను మిస్‌ అయి ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సహనం కోల్పోయాడు. ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను గట్టిగా తన్నాడు. కాగా, షకీబ్‌ ఇదే మ్యాచ్‌లో మరోసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యాడు.

ప్రత్యర్ధి విజయం దాదాపు ఖరారైన సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అతను.. మరోసారి అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ఇంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ, వికెట్లను పీకి పారేశాడు. కాగా, షకీబ్‌ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా, స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన షకీబ్‌.. యువ క్రికెటర్లకు స్పూర్తిగా నిలవాల్సింది పోయి, ఇలా దురుసుగా ప్రవర్తించడం సిగ్గు చేటని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే షకీబ్‌ ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా ప్రవర్తనతోనే మందలింపుకు గురయ్యాడు. అయితే తాజా వీడియోలపై బంగ్లా క్రికట్‌ బోర్డు స్పందిస్తే మాత్రం అతనిపై కఠిన చర్యలు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top