
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్‌కప్ తర్వాత క్రిస్ సిల్వర్‌వుడ్ తన హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్‌గా నియమించింది.
ఆదిలోనే చేదు అనుభవం
టీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్‌లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.
ఆ తర్వాత వరుస విజయాలు
దాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది.
ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
టీ20 వరల్డ్‌కప్ వరకూ అతడే!
ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్‌కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్‌గానూ పనిచేశాడు. ఇక ఫుల్‌టైమ్ హెడ్‌కోచ్‌గా వెస్టిండీస్‌తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌తో అతడి ప్రయాణం మొదలుకానుంది.
చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్