భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

SAFF Championship: India Bangladesh Match Draw - Sakshi

‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్‌ తరఫున సారథి సునీల్‌ చెత్రీ 27వ నిమిషంలో గోల్‌ చేశాడు. చెత్రీకిది 76వ అంతర్జాతీయ గోల్‌  కాగా, బ్రెజిల్‌ దిగ్గజం పీలే గోల్స్‌ (77) రికార్డును సమం చేయడానికి చెత్రీ కేవలం ఒక్క గోల్‌ దూరంలో ఉన్నాడు. బంగ్లా ప్లేయర్‌ అరాఫత్‌ (74వ నిమిషంలో) గోల్‌ చేసి స్కోర్‌ను సమం చేశాడు. 

రోహిత్‌కు నిరాశ
ఓస్లో (నార్వే): ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రోహిత్‌ (65 కేజీలు)కు చుక్కెదురైంది. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన బౌట్‌లో రోహిత్‌పై ‘విక్టరీ బై ఫాల్‌’ పద్ధతిన తుల్గాతుముర్‌ ఒచిర్‌ (మంగోలియా) గెలుపొం దాడు. మ్యాచ్‌లో రోహిత్‌ 4–10తో వెనుకబడి ఉన్న సమయంలో ఒచిర్‌ ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని క్షణాల పాటు పట్టి ఉంచాడు. దాంతో రిఫరీ ఒచిర్‌ను విజేతగా ప్రకటించాడు. వాస్తవానికి రోహిత్‌ ప్రిక్వార్టర్స్‌లో ఓడగా... అతడిని ఓడించిన జగిర్‌ ఫైనల్‌కు చేరాడు. దాంతో రెపీచేజ్‌ ద్వారా రోహిత్‌ కాంస్యం బరిలో నిలిచాడు.

తొలి మ్యాచ్‌లో రోహిత్‌ 12–2తో సెలాహట్టిన్‌ (టర్కీ)పై నెగ్గాడు. మహిళల 55 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో భారత రెజ్లర్‌ పింకీ 6–8తో నినా హెమ్మర్‌ (జర్మనీ) చేతిలో ఓడి పసిడి పోరుకు దూరమైంది. అయితే రెపీచేజ్‌ పద్ధతి ద్వారా ఆమె కాంస్యం గెలిచే అవకాశం ఉంది. మరో భారత రెజ్లర్‌ సంగీతా ఫోగాట్‌ (62 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో... పురుషుల విభాగాల్లో సత్యవర్త్‌ కడియాన్‌ (97 కేజీలు), సుశీల్‌ (70 కేజీలు) క్వాలిఫయింగ్‌ రౌండ్‌ల్లో తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు. 

చదవండి: Dronavalli Harika: ఒలింపిక్‌ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top