ఆర్‌సీబీ రె‘ఢీ’ | Royal Challengers Bangalore are aiming for a second title in the IPL | Sakshi
Sakshi News home page

ఆర్‌సీబీ రె‘ఢీ’

Mar 19 2026 1:24 AM | Updated on Mar 19 2026 1:24 AM

Royal Challengers Bangalore are aiming for a second title in the IPL

ఐపీఎల్‌లో రెండో టైటిల్‌పై గురి

పటిష్టంగా బెంగళూరు బృందం 

కోహ్లిపైనే అందరి దృష్టి  

మరో 9 రోజుల్లో ఐపీఎల్‌

ఒకటి కాదు రెండు కాదు పదిహేడు సీజన్ల పాటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో విఫలమైంది. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో బరిలోకి దిగడం చివరకు ఖాళీ చేతులతో వెనుదిరగడం జట్టుకు అలవాటులా కనిపించింది. మూడుసార్లు ఫైనల్‌ చేరినా రన్నరప్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కానీ ఆర్‌సీబీ అభిమానుల కోరిక ఎట్టకేలకు గత సీజన్‌లో తీరింది. 

ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో బెంగళూరు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. విజయోత్సవ వేడుకలో అపశ్రుతితో ఈ గెలుపు సంబరాలు కాస్త తగ్గినా ఇప్పుడు అంతా సర్దుకుంది. తమ సొంత మైదానంలో మళ్లీ మ్యాచ్‌లకు ఆర్‌సీబీ సిద్ధమైంది. గత ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా దాదాపు అదే బృందాన్ని కొనసాగించిన టీమ్‌ మళ్లీ టైటిల్‌ కొడుతుందా లేదా వేచి చూడాలి!  

సాక్షి క్రీడా విభాగం  
తొలి టైటిల్‌ కోసం ఎంతగానో ఎదురు చూసిన తర్వాత ఆర్‌సీబీ టీమ్‌లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఒకప్పుడు కోహ్లి లేదా గేల్‌ లేదా డివిలియర్స్‌ల వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఆధారపడిన జట్టు 2025 సీజన్‌లో సమష్టి తత్వాన్ని నమ్ముకుంది. అదే మంచి ఫలితాలను ఇచ్చింది. కోహ్లి ఎప్పటిలాగే తనదైన శైలిలో 657 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే కోహ్లి ప్రదర్శనకు మించి ఇతర ఎన్నో అంశాలు జట్టును నడిపించాయి. జట్టు కష్టాల్లో నిలిచిన ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు హీరోగా నిలిచాడు.

కృనాల్‌ పాండ్యా, రొమారియో షెఫర్డ్, టిమ్‌ డేవిడ్, హాజల్‌వుడ్, భువనేశ్వర్‌... ఇలా అందరూ తమ పాత్ర పోషించారు. కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ ప్రశాంతంగా జట్టును నడిపించిన తీరు కూడా ప్రశంసనీయం. కెపె్టన్‌ హోదా లేకపోయినా కోహ్లి టీమ్‌లో నింపే స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి సీజన్‌లో కూడా ఆర్‌సీబీ నుంచి అభిమానులు అదే ఆశిస్తున్నారు. 

సరిగ్గా చెప్పాలంటే ఇతర జట్లతో పోలిస్తే వేలం సమయంలో ఆర్‌సీబీకి పెద్ద సమస్య లేకపోయింది. వేలంలో 8 మంది ఆటగాళ్లను ఎంచుకోగా... వీరిలో ఐదుగురు భారత్‌కు ఆడని ‘అన్‌క్యాప్డ్‌’ ఆటగాళ్లే. మిగతా ముగ్గురు కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాళ్లు కాదు. ముందు జాగ్రత్తగా వేలంలో జాకబ్‌ డఫీ, జోర్డాన్‌ కాక్స్, వెంకటేశ్‌ అయ్యర్‌లను తీసుకుంది. అయితే ఎవరూ ఉన్నా, లేకున్నా ఎప్పటిలాగే టీమ్‌లో జోష్‌ నింపేందుకు కోహ్లి ఉండటమే అది పెద్ద బలం.  

పదునైన బ్యాటింగ్‌... 
2025 ఫైనల్లో ఆడిన తుది జట్టును ఈసారి మొదటి మ్యాచ్‌లో ఆడటం కోసం చూసుకుంటే ఎనిమిది మంది కచ్చితంగా జట్టులో ఉంటారు. ఆర్‌సీబీ విడుదల చేసిన లివింగ్‌స్టోన్‌కు బదులుగా ఈసారి అంతకంటే విధ్వంసకర బ్యాటర్‌ జాకబ్‌ బెతెల్‌కు తుది జట్టులో చోటు ఖాయం. గత ఏడాది అతను 2 మ్యాచ్‌ల్లో ఆడగా, అందులో ఒక అర్ధసెంచరీ ఉంది. ఇటీవలి టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌పై చెలరేగి బెతెల్‌ సాధించిన సెంచరీని చూస్తే ఆర్‌సీబీ బలం మరింత పెరిగినట్లే. 

మూడో స్థానంలో ఆడిన మయాంక్‌ అగర్వాల్‌ జట్టుకు దూరమయ్యాడు. ఈ స్థానం కోసం ఇద్దరు భారత బ్యాటర్లు పడిక్కల్, వెంకటేశ్‌ అయ్యర్‌ మధ్య పోటీ ఉంది. అయితే గతంలో ఇదే జట్టుతో ఆడిన అనుభవం, ఇటీవలి ఫామ్, లోకల్‌ ముద్ర కారణంగా పడిక్కల్‌కే ఎక్కువ చాన్స్‌ ఉంది. కోహ్లి, సాల్ట్‌లతో తిరుగులేని ఓపెనింగ్‌ జట్టు సొంతం. వీరిద్దరు ఇచ్చే ఆరంభాలే జట్టు విజయాలకు పునాది అవుతాయి. 

మిడిలార్డర్‌లో పాటీదార్, డేవిడ్, జితేశ్‌ శర్మలు ఇన్నింగ్స్‌ను ధాటిగా నడిపించగల సమర్థులు. ఈ బృందం విఫలమైనా ఆల్‌రౌండర్లు కృనాల్‌ పాండ్యా, షెఫర్డ్‌ బ్యాటింగ్‌తో ఆదుకోగలరు. గత సీజన్‌లో ఇది బాగా కనిపించింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో భారీ స్కోర్లు సాధిస్తే జట్టుకు తిరుగుండదు.  

భువీ, దయాళ్‌లపై భారం... 
బౌలింగ్‌కు సంబంధించి ఆర్‌సీబీని ఒకే ఒక సమస్య వెంటాడుతోంది. అదే స్టార్‌ పేసర్‌ హాజల్‌వుడ్‌ లేకపోవడం. గత సీజన్‌లో 22 వికెట్లతో జట్టుకు విజయం అందించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. హాజల్‌వుడ్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలీని స్థితిలో ప్రత్యామ్నాయంపై జట్టు దృష్టి పెట్టింది. 

ఇద్దరు భారత పేసర్లు భువనేశ్వర్, యశ్‌ దయాళ్‌ కీలకం కానుండగా, ఈసారి పేస్‌ విషయంలో వీరిపై అదనపు భారం ఉంది. హాజల్‌వుడ్‌కు బదులుగా డఫీ, తుషారాలలో ఒకరిని ఆడిస్తారా లేక భారత పేసర్‌ రసిఖ్‌ దార్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. స్పిన్‌లో మరోసారి సుయశ్‌ శర్మ ప్రధాన అస్త్రం కాగా, కృనాల్‌ పాండ్యా లెఫ్టార్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు. షెఫర్డ్‌ కూడా బౌలింగ్‌లో జట్టు కోటా పూర్తి చేయగలడు.  

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ గణాంకాలు 
ఆడిన మ్యాచ్‌లు 271  
గెలిచినవి 134 ఓడినవి 133  రద్దు
అత్యుత్తమ ప్రదర్శన: విజేత (2025), రన్నరప్‌ (2009, 2011, 2016)

2026 జట్టు వివరాలు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్ ), పడిక్కల్, కోహ్లి, సాల్ట్, జితేశ్, కాక్స్, కృనాల్, స్వప్నిల్, డేవిడ్, షెఫర్డ్, బెతెల్, వెంకటేశ్‌ అయ్యర్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్‌ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, హాజల్‌వుడ్, రసిఖ్‌ దార్, సుయాశ్, భువనేశ్వర్, నువాన్‌ తుషారా, అభినందన్‌ సింగ్, డఫీ, యశ్‌ దయాళ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement