Asia Cup 2022 IND VS PAK Super 4:  పాక్‌పై ఒక్కసారి కూడా హిట్‌ అవ్వని హిట్‌మ్యాన్‌

Rohit Sharma T20I Record VS Pakistan Is Very Poor, No Single Half Century Yet - Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో దాదాపు అన్ని దేశాలపై ఘనమైన రికార్డు కలిగిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. దాయాది పాక్‌పై మాత్రం పేలవ ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు 134 మ్యాచ్‌లు ఆడి 139.8 స్ట్రయిక్‌ రేట్‌తో 4 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 3520 పరుగులు చేసిన హిట్‌ మ్యాన్‌.. పాక్‌పై 9 టీ20ల్లో 13.66 సగటున 112.32 స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్కసారి కూడా అర్ధసెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. 

2007 టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో చేసిన 30 పరుగులకే ఇప్పటివరకు అతని అత్యధిక స్కోర్‌గా కొనసాగుతుంది.  నాటి మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్‌.. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆతర్వాత 15 ఏళ్లుగా రోహిత్‌ ఒక్కసారి కూడా కనీసం 30 పరుగుల మార్కును అందుకోలేకపోవడం విచారకరం. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో గ్రూప్‌ దశలో ఆడిన మ్యాచ్‌లోనూ హిట్‌మ్యాన్‌ మరోసారి విఫలమయ్యాడు. 18 బంతులు ఆడి ఓ సిక్సర్‌ సాయంతో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.  

టీ20ల్లో ఇలా ఉంటే, పాక్‌పై వన్డేల్లో రోహిత్‌కు మంచి రికార్డే ఉంది. కెరీర్‌ మొత్తంలో దాయాదితో 17 సార్లు తలపడగా.. 48.66 సగటున 730 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్‌లో 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో చేసిన 140 పరుగులు హిట్‌మ్యాన్‌ కెరీర్‌ మొత్తానికే హైలైట్‌ అని చెప్పాలి. పాక్‌పై వన్డేల్లో పర్వాలేదనిపిస్తూ, టీ20ల్లో ఫ్లాప్‌ అవుతున్న హిట్‌మ్యాన్‌ నుంచి అతని అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. ఇవాల్టి మ్యాచ్‌లో ఎలాగైనా చెలరేగి హిట్‌మ్యాన్‌ పేరుకు సార్ధకత చేకూర్చాలని కోరుకుంటున్నారు. 
చదవండి: పా​కిస్తాన్‌తో మ్యాచ్‌.. అవేష్‌ ఖాన్‌కు నో ఛాన్స్‌! భారత యువ పేసర్‌ ఎంట్రీ!
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top