భారత క్రికెట్ జట్టుకు సొంతగడ్డపై మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న టీమిండియాకు న్యూజిలాండ్ వరుస షాకిలిస్తోంది. మొన్న టెస్టు సిరీస్.. నేడు వన్డే సిరీస్. స్వదేశంలో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి.
ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన మెన్ ఇన్ బ్లూ.. ఈ అప్రతిష్టను మూటకట్టుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. విరాట్ కోహ్లి ఆఖరి వరకు పోరాడినప్పటికి.. మిగితా సీనియర్ ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ క్రమంలో సిరీస్ ఓటమికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.
రోహిత్.. నోహిట్
సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్ ఈ సిరీస్‌లో ముగబోయింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. త్వరగా ఔట్ కావడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ అన్నట్లుగా రోహిత్ మ్యాచ్ ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.
జడేజా అట్టర్ ప్లాప్
రవీంద్ర జడేజా.. భారత జట్టు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన ఘనత అతడిది. అటుంటి జడేజా ఈ సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బహుశా తన కెరీర్‌లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఈ సిరీస్ ఒకటిగా నిలిచిపోతుంది. మూడు మ్యాచ్‌లలో జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా అని బ్యాట్‌తో కూడా రాణించలేకపోయాడు. కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో ప్రధాన ఆల్‌రౌండర్‌గా జడేజా ప్రభావం చూపకపోవడం భారత్‌ను దెబ్బతీసింది.
శ్రేయస్ సైలెంట్..
ఇక మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులతో రాణించిన అయ్యర్.. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడో వన్డేలో అయ్యర్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్‌లో నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్‌కు పనిచెప్పకపోవడం భారత్ ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
బౌలింగ్ ఫెయిల్
ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది. భారత పేసర్లు తేలిపోయారు. హర్షిత్ రాణా, సిరాజ్ ఫర్వాలేదన్పించినప్పటికి.. ప్రసిద్ద్ కృష్ణ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. తొలి వన్డేలో భారత బౌలర్లు ఏకంగా 300 పరుగులు సమర్పించుకున్నారు.
చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!


