IND vs AUS: అతడిని టీమిండియా చాలా మిస్‌ అవుతోంది.. లేదంటే ఆసీస్‌కు చుక్కలే!

Rishabh Pant wouldnt have spared Lyon and Kuhnemann: Danish Kaneria - Sakshi

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమికి అడుగు దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే చాపచుట్టేసింది.  దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం అసాధ్యమే. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ దాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. ఛతేశ్వర్ పూజారా(59) మినహా మిగితా బ్యాటర్లంతా  దారుణంగా విఫలమయ్యారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత జట్టులో రిషబ్‌ పంత్‌ లేని లోటు సుస్పష్టంగా కన్పిస్తోంది అని కనేరియా అభిప్రాయపడ్డాడు. ఇండోర్‌ టెస్టులో పంత్‌ ఉండి ఉంటే లియాన్, కుహ్నెమాన్‌లపై ఎదురుదాడికి దిగేవాడు అని అతడు అన్నాడు.

"బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రిషబ్‌ పంత్‌ను సేవలను టీమిండియా కోల్పోతోంది. ఒకవేళ ఇండోర్‌ టెస్టుకు జట్టులో పంత్‌ ఉండే ఉంటే ఆసీస్‌ స్నిన్నర్లకు చుక్కలు చూపించేవాడు. లియోన్, కుహ్నెమాన్‌లను ఎటాక్‌ చేసి ఒత్తిడిలోకి నెట్టేవాడు. ఎటువంటి పిచ్‌లపైన అయినా స్నిన్నర్లపై ఎదురుదాడికి దిగే సత్తా అతడికి ఉంది. బంతిని స్టాండ్స్‌కు పంపడం ఒక్కటే అతడికి తెలుసు.

అయితే ఈ టెస్టులో మాత్రం భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 250 నుంచి 300 పరుగులు చేసి ఉంటే బాగుండేది. కానీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ టీమిండియా విఫలమై ఓటమి అంచున నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 80 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి" అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డానిష్ కనేరియా పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్‌.. అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top