భారత మహిళా క్రికెట్ జట్టులో లేడీ ధోనిగా పిలువబడే రిచా ఘోష్‌కు (Richa Ghosh) బంపరాఫర్ లభించింది. ప్రపంచకప్ విధ్వంసాల గౌరవార్దం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (west Bengal) ఆమెను డీఎస్పీగా (DSP) నియమించింది.
భారత్, శ్రీలంక ఇటీవల సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో (Women' Cricket World Cup 2025_ రిచా వీరవిహారం చేసింది. ఫైనల్, సెమీఫైనల్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఆమెను డీఎస్పీ ఉద్యోగం వరించింది.
గతంలో రిచా తరహాలోనే ఇద్దరు భారత క్రికెటర్లను వారివారి సొంత రాష్ట్రాలు డీఎస్పీలుగా నియమించాయి. 2024లో తెలంగాణ ప్రభుత్వం టీమిండియా పేసు గుర్రం మహ్మద్ సిరాజ్‌ను డీఎస్పీగా నియమించింది. ఇటీవలే ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ విజేత దీప్తి శర్మను కూడా ఆమె సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో డీఎస్పీగా నియమించారు.
ప్రపంచకప్ గెలిచిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన రిచాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) మరియు సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ ఘనంగా సత్కరించాయి. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం రిచాకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడంతో పాటు బంగ భూషణ్ బిరుదుతోనూ సత్కరించింది.
రిచా 2025 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.
లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.


