
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.
వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (India vs England) ఈ గ్రాండ్ డబుల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్‌లో దీప్తి 2607 పరుగులు చేసింది.
దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లుగా ఉన్నారు.
దీప్తి ప్రభంజనం
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్‌లో శ్రీలంకపై హాఫ్ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.
మ్యాచ్ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. హీథర్ నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.
మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42 పరుగులకే ప్రతిక రావల్ (6), హర్లీన్ డియోల్ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్ హర్మన్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/2గా ఉంది.