విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ | World Cup Winning India Women's Cricket Team Members Real Life Stories | Sakshi
Sakshi News home page

విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ

Nov 3 2025 12:25 PM | Updated on Nov 3 2025 3:44 PM

World Cup Winning India Women's Cricket Team Members Real Life Stories

2025, నవంబర్ 2. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన రోజు. ఈ రోజు భారత్‌ తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2025 ఎడిషన్‌ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపుతో యావత్‌ భారతావణి ఉప్పొంగి పోయింది. 

భారత ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. తొలిసారి ప్రపంచకప్‌ గెలిచిన భారత క్రికెటర్లు కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయుల ప్రపంచకప్‌ కలను సాకారం చేసిన టీమిండియా ప్లేయర్ల వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీరు, కలలు దాగి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. దూషించిన నోళ్లతోనే జేజేలు కొట్టించుకుంది
పంజాబ్‌లోని మోగాలో జన్మించిన హర్మన్‌ప్రీత్, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. 1983లో కపిల్ దేవ్ భారత జట్టుకు తొలి ప్రపంచకప్‌ అందించి, పురుషుల క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పలికితే.. హర్మన్‌ 2025 ప్రపంచకప్‌ విక్టరీతో మహిళల క్రికెట్‌లో కొత్త శకాన్ని ప్రారంభించింది.

హర్మన్‌ క్రీడల్లో అడుపెట్టాలనుకున్న అందరు అమ్మాయిల్లాగే చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగి భారతీయుల ప్రపంచకప్‌ కలను సాకారం చేసింది. 

చిన్నతనంలో హర్మన్‌ అబ్బాయిలతో క్రికెట్‌ ఆడుతూ మెళకువల నేర్చుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి రావడంతో అబ్బాయిలతో క్రికెట్‌ ఏంటని బంధులందరూ ఆమెను దూషించారు. అయినా పట్టువదలని హర్మన్‌ అనుకున్నది సాధించి దూషించిన నోళ్లతోనే శభాష్‌ అనిపించుకుంది.

అమన్‌జోత్ కౌర్.. కార్పెంటర్ తండ్రి కలను నెరవేర్చిన కూతురు
క్రికెటర్‌గా అమన్‌జోత్‌ ప్రయాణం తండ్రి చెక్కిన బ్యాట్‌తో మొదలైంది. ఆమె తండ్రి ఓ  కార్పెంటర్‌. బాల్యంలో అమన్‌జోత్‌ బాలురతో క్రికెట్‌ ఆడటాన్ని చూసి ఊరంతా విమర్శించేవారు. అయినా తండ్రి ఆమెను వెనకేసుకొచ్చేవాడు. రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమన్‌జోత్‌ను అకాడమీకి తీసుకెళ్లెవాడు. 

భారత జట్టు ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత అమన్‌జోత్‌ తండ్రి ఆనంధానికి అవథుల్లేవు. “నా కూతురు గెలిచింది” అంటూ విజయ గర్వంతో ఊగిపోయాడు.

రేణుకా సింగ్‌.. తల్లి త్యాగాన్ని, అన్న నమ్మకాన్ని నిలబెట్టింది
హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లాలో జన్మించిన రేణుకా సింగ్‌కు మూడేళ్ల వయసుండగానే తండ్రి చనిపోయాడు. తల్లి సునీతా సింగే రేణుకా బాగోగులు చూసింది. రేణుకను క్రికెట్‌ అకాడమీకి పంపేందుకు సునీత ఎన్నో కష్టాలు పడింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో రేణుక కోసం తల్లి సునీత ఎన్నో త్యాగాలు చేసింది. 

రేణుక కోసం ఆమె అన్న వినోద్‌ కూడా క్రికెట్‌ను వదిలేశాడు. ఆర్దిక కష్టాలు ఉండటంతో ఇంట్లో ఒక్కరికే ఆకాడమీలో చేరే అవకాశం ఉండేది. రేణుక క్రికెట్‌లో రాణిస్తుండటంతో వినోద్‌ తన కలను చంపుకున్నాడు. చివరికి రేణుక ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో కీలక​ సభ్యురాలిగా నిలిచి తల్లి, అన్నల త్యాగాలకు న్యాయం చేసింది.

క్రాంతి గౌడ్‌.. పోలీస్‌ కానిస్టేబుల్‌ కూతురు
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని ఘువారా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాంతి గౌడ్‌ ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచింది. క్రాంతి తండ్రి ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. కుటుంబం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, క్రాంతికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తండ్రి తన పెన్షన్‌తో ఆమెకు క్రికెట్ కిట్ కొనిపెట్టాడు. తల్లి రోజూ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేది.

క్రాంతి చిన్నతనంలో అబ్బాయిలతో గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగింది. క్రాంతి క్రికెటర్‌ అవుతానంటే ఊరిలోని వారంతా నవ్వేవారు. ఇవాళ ఆమె ప్రపంచకప్‌లో భారత పేస్‌ బౌలింగ్‌ సెస్సేషన్‌గా నిలిచింది. టీమిండియా వరల్డ్‌కప్‌ గెలిచాక​ క్రాంతి సొంత ఊరిలో సంబరాలు అంబరాన్ని అంటాయి.  

షఫాలీ వర్మ.. బాలుడి వేషధారణలో..!
షఫాలీ వర్మ హర్యానా రాష్ట్రంలోని రూథక్‌లో జన్మించింది. చిన్నతనం నుంచే ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. కానీ స్థానిక అకాడమీలో అమ్మాయిలకు ప్రవేశం లేదు. దీంతో ఆమె బాలుడి వేషధారణలో, అన్న కోసం తయారు చేసిన జెర్సీ వేసుకుని ప్రాక్టీస్‌కి వెళ్లేది. 

షఫాలీ ఆర్థికంగా వెనుకపడిన కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి సంజయ్ వర్మ ఎంతో కష్టపడి ఆమెను అకాడమీలో చేర్పించాడు. ఓ సమయంలో అతని దగ్గర షఫాలీకి కిట్‌ కొనిచ్చే స్తోమత కూడా లేకుండింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న షఫాలీ ఫైనల్లో 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి, భారత్‌ను విశ్వ విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర పోషించింది.

దీప్తి శర్మ.. రైల్వే ఉద్యోగి తండ్రి కలను నిజం చేసిన బౌలింగ్ సంచలనం
ఉత్తరప్రదేశ్‌లోని సాగర్‌జీ నగర్‌కు చెందిన దీప్తి, తన అన్నతో కలిసి క్రికెట్‌ ఆడుతూ పెరిగింది. తండ్రి రైల్వే ఉద్యోగి. అందరిలాగే అబ్బాయిలతో క్రికెట్‌ ఆడుతుండటంతో దీప్తి కూడా విమర్శలు ఎదుర్కొంది. అయినా తండ్రి ప్రోత్సాహంతో ముందడుగు వేసి, టీమిండియా ప్రపంచకప్‌ కలను సాకారం చేసింది. ఫైనల్లో దీప్తి అర్ద సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది.

జెమిమా రోడ్రిగ్స్.. మల్టీ టాలెంటెడ్ స్టార్
సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాది భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్‌.. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. జెమిమా తండ్రి స్వయంగా కోచ్‌గా మారి ఆమెను ప్రాక్టీస్‌కు తీసుకెళ్లెవాడు. జెమిమాకు క్రికెట్‌తో పాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. 

చదవండి: CWC25 Team India Prize Money: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement