
Photo Courtesy: BCCI
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్ అయ్యింది. మే 8న రద్దైన ఐపీఎల్ 2025, మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న రాత్రి ప్రకటించింది.
మే 8న 10 ఓవర్ల పాటు సాగి రద్దైన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ఈ నెల 24న మొదటి నుంచి నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు నిన్న ప్రకటించిన రీ షెడ్యూల్‌కు చాలా తేడాలున్నాయి. వేదికలు చాలా వరకు మారాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలు ఖరారు కావాల్సి ఉంది. క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 వాయిదా పడటం ప్లే ఆఫ్స్‌కు అతి చేరువలో ఉన్న ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటం, గాయాల బారిన పడటంతో జట్టును వీడనున్నారు. ఐపీఎల్ వాయిదాకు ముందే ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయపడ్డారు. పాటిదార్ ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత కూడా కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతాడు. పాటిదార్ స్థానంలో కొన్ని మ్యాచ్‌లకు విరాట్ కోహ్లి లేదా జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
రీ షెడ్యూల్‌లో ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్‌లకు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్ పూర్తికాక ముందే (మే 29) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్ పూర్తైన వారం రోజులకే (జూన్ 11) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.
ఆర్సీబీ జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు: ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్
వెస్టిండీస్ ఆటగాళ్లు: రొమారియో షెపర్డ్
మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐపీఎల్ ఫైనల్ తర్వాత వారం రోజుల సమయమున్నా (డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం).. ఆ దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్ల చాయిస్‌కే వదిలిపెట్టింది. దీంతో ఆ దేశ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన జోష్ హాజిల్‌వుడ్ తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమేనని తెలుస్తుంది. హాజిల్‌వుడ్ పోతే ఎంగిడి ఉన్నాడులే అనుకుంటే అతను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌నే తన మొదటి ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.
ఈ లెక్కన చూస్తే ఆర్సీబీలో టిమ్ డేవిడ్ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేదు. శ్రీలంక పేసర్ నువాన్ తుషార ఉన్నా అతను ఏ మేరకు అందుబాటులో ఉంటాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీని ఐపీఎల్ వాయిదా పడటం దారుణంగా దెబ్బకొట్టింది.
ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే లయ తప్పే ప్రమాదముంది. ఈ సీజన్‌పై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సాలా కప్ నమ్మదే అని ఆర్సీబీ అభిమానులు ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలుపెట్టారు. ఈ లోపే భారత్, పాక్ మధ్య యుద్దం మొదలై ఆర్సీబీ గెలుపు జోష్‌ను దెబ్బకొట్టింది. మరి, ఉన్న వనరులతో ఆర్సీబీ మున్ముందు మ్యాచ్‌ల్లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
ఐపీఎల్ వాయిదాకు ముందు ఆర్సీబీ జట్టు..
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, స్వస్థిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాఠీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, రసిఖ్ దార్ సలామ్, నువాన్ తుషార, అభినందన్ సింగ్
ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.