
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) కీలక దేశవాళీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్-2025 తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్.. ఈ ఏడాది దులిప్ ట్రోఫీ ఆడలేకపోతున్నాడు.
కాగా ఆర్సీబీ పదిహేడేళ్ల కలకు తెరదించుతూ ఈసారి ఆ జట్టుకు ట్రోఫీ అందించాడు రజత్ పాటిదార్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటి.. ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లికి కూడా సాధ్యంకాని విధంగా టైటిల్ గెలిచి ఆర్సీబీని ఖుషీ చేశాడు. అయితే, టోర్నీ మధ్యలోనే రజత్ వేలికి గాయమైంది.
బీసీసీఐ వైద్యుల సూచన మేరకు
ఈ క్రమంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ రజత్ పాటిదార్ ఇంకా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్యుల సూచన మేరకు అతడు మరికొంత కాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకే దులిప్ ట్రోఫీ మ్యాచ్‌లకు రజత్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం గురించి రజత్ పాటిదార్ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మధ్య ప్రదేశ్ ఆఫ్- సీజన్ శిక్షణా శిబిరంలో రజత్ పాల్గొన్నాడు. అయితే, తను బ్యాటింగ్ మాత్రం చేయలేదు. బీసీసీఐ వైద్య బృందం అతడిని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.
దులిప్ ట్రోఫీకి దూరం..
కుడిచేతి వేలికి అయిన గాయం పూర్తిగా నయమైన తర్వాతే అతడు మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. దులిప్ ట్రోఫీలో ఈసారి అతడు పాల్గొనలేకపోతున్నాడు. అయితే, రంజీ ట్రోఫీ నాటికి అతడు తిరిగి వస్తాడు’’ అని పేర్కొన్నాయి.
కాగా 2024లో రజత్ పాటిదార్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 63 పరుగులు చేశాడు.
షెడ్యూల్ ఇదే
ఇక ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడిన రజత్.. అంతర్జాతీయ టీ20లలో ఇంత వరకు అడుగుపెట్టలేదు. ఇక ఐపీఎల్-2025లో సత్తా చాటిన రజత్ పాటిదార్‌ను ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌కు పరిశీలించారు. కానీ గాయం వల్ల అతడికి అవకాశం రాలేదు.
కాగా ఆగష్టు 28- సెప్టెంబరు 15 వరకు దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తొలి క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ - ఈస్ట్ జోన్ తలపడనుండగా.. రెండో క్వార్టర్స్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్‌ను ఢీకొట్టనుంది. ఇక ఇప్పటికే సౌత్ జోన్, వెస్ట్ జోన్ సెమీ ఫైనల్ చేరగా.. సెమీస్ ఫలితాల తర్వాత సెప్టెంబరు 11- 15 వరకు ఫైనల్ జరుగనుంది.
చదవండి: నాకు ఇలానే జరిగింది.. అదే అయితే పంత్ ఆడడం కష్టమే: పాంటింగ్