
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు.
బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. స్కాన్ రిపోర్ట్‌లు కోసం బీసీసీఐ వైద్య బృందం ఎదురు చూస్తోంది.
ఒకవేళ అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే అది భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న పంత్.. ఈ మ్యాచ్‌తో పాటు ఆఖరి టెస్టు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.
"రిషబ్ పంత్ కుడి కాలి పాదానికి బలంగా బంతి తాకింది. దెబ్బ తాకిన పంత్ తన కాలును నేలపై పెట్టలేకపోయాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం మైదానంలో లోపలికి వచ్చేముందు అతడు కొద్ది నిమిషాల పాటు అటు ఇటు తిరిగాడు. అయితే వెంటనే వాపు రావడం నాకు ఆందోళన కలిగించింది.
గతంలో నాకు ఓ సారి ఇటువంటి గాయమే అయింది. పాదంలో చిన్న చిన్న పెళుసుగా ఉండే ఎముకలు ఉంటాయి. బంతి తాకడంతో అందులో ఒకట్రెండు విరిగిపోయాయి. అలా జరిగితే కాలు కింద పెట్టలేము. ఒకవేళ పంత్ విషయంలో అదే జరిగితే అతడు ఈ మ్యాచ్ నుంచి వైదొలగక తప్పదు. అలా అతడు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఒకవేళ తిరిగొచ్చిన ఇటువంటి రివర్స్ స్వీప్ షాట్లు ఆడడని నేను ఆశిస్తున్నా అని స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్