Ravichandran Ashwin: చంద్రముఖిలా మారిన కోహ్లి.. ముందుగా డీకేను తిట్టుకున్నాను! ఆ తర్వాత

Ravichandran Ashwin on Virat Kohli batting exploits - Sakshi

విరాట్‌ బ్యాటింగ్‌పై అశ్విన్‌  

T20 World Cup 2022- India Vs Pakistan- Virat Kohli- సిడ్నీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ ముగిసి రోజులు గడుస్తున్నా అది పంచిన ఉత్కంఠను మాత్రం సగటు క్రికెట్‌ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. మైదానం బయటే పరిస్థితి ఇలా ఉంటే మైదానంలో చివరి పరుగు చేసిన అశ్విన్‌ పరిస్థితి ఏమిటి. ఆ సమయంలో అతనికి ఎలా అనిపించింది? ఈ ఆసక్తికర విశేషాలన్నీ స్వయంగా అశ్విన్‌ పంచుకున్నాడు. ముఖ్యంగా చివరి క్షణాల్లో తన అనుభవాన్ని అతను వివరించాడు. ‘45 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి.

ఇక కోహ్లి, హార్దిక్‌ చెరో 60 పరుగులు చేస్తే తప్ప గెలవలేమనిపించింది. అవసరం పడితే నేనూ బ్యాటింగ్‌లో ఒక చేయి వేయాలని అనుకున్నాను. అయితే కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో ఒక్కసారిగా మ్యాచ్‌ను మార్చేశాడు. 45 బంతుల తర్వాత అతని బ్యాటింగ్‌ చూస్తే చంద్రముఖి సినిమా గుర్తుకొచ్చింది. గంగనుంచి జ్యోతిక ఒక్కసారిగా చంద్రముఖిలా మారిపోయినట్లు అనిపించింది. ప్రభుతో ‘నన్ను వదలవా’ అంటున్నట్లు మదిలో మెదిలింది! నేను చివరకు 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిప్పుడు క్రీజ్‌లో వచ్చాను.

దినేశ్‌ కార్తీక్‌ను తిట్టుకున్నాను
ఆ స్థితికి నన్ను తెచ్చినందుకు ముందుగా దినేశ్‌ కార్తీక్‌ను తిట్టుకున్నాను. అయితే మనమూ ఏదైనా చేయగల అవకాశం వచ్చినట్లు భావించాను. నాకైతే పిచ్‌ వరకు వెళ్లడం ఒక సుదీర్ఘ ప్రయాణంగా అనిపించింది. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం ప్రకారం మనకు ఇష్టం లేని చోట ఉండే నిమిషం కూడా గంటలా అనిపిస్తుంది.  కోహ్లి వచ్చి ఎక్కడెక్కడ పరుగులు తీయవచ్చో చెప్పాడు. బాబూ... నువ్వయితే అలాంటి చోట్ల షాట్లు కొడతావు, నేనెలా ఆడగలను, నాకు వచ్చిందే చేస్తా అని మనసులో అనుకున్నా.

విజయం కోసం పోరాడుతున్న ఒక వ్యక్తిని నేను నేరుగా ఎలా అనగలనని బయటకు మాత్రం చెప్పలేదు. అయితే బౌలర్‌ నవాజ్‌ ఎలా బౌలింగ్‌ చేస్తున్నాడు. లెగ్‌స్టంప్‌పై వేస్తున్నాడా...ఇలా పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ తరహాలో పలు ప్రశ్నలు అడిగేశాను. అతను మాత్రం చాలా చెప్పినా...నేను మాత్రం ఖాళీ వైపు బంతిని తోసి నా జీవితం కోసం పరుగెత్తినట్లుగా సింగిల్‌ తీయాలని అనుకున్నా.

ఇక నా ఇంటిపై రాళ్లు వేయరులే
లెగ్‌స్టంప్స్‌ మీద బంతిని వేస్తున్నాడు, జరిగి కవర్స్‌ మీదుగా కొట్టు అని చివరి సలహా ఇచ్చాడు. పరిస్థితి ఇలా ఉంది, చలి పెడుతోంది, ఇలాంటప్పుడు కవర్స్‌ మీదుగా కొట్టమంటాడేమిటి అని అనుకున్నాను. చివరి బంతి దిశను బట్టే అది వైడ్‌ అవుతుందని భావించి వదిలేశా. ఇక నా ఇంటిపై రాళ్లు వేయరులే అని ధైర్యం వచ్చింది. కోహ్లిని రవూఫ్‌ బౌలింగ్‌లో అంత అద్భుతమైన సిక్సర్లు కొట్టనిచ్చిన దేవుడు నన్ను ఒక్క సింగిల్‌ తీయనీయడా అనుకున్నా. చివరకు అలాగే జరిగింది. నిజంగా ఒక అద్భుత మ్యాచ్‌లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది’ అని అశ్విన్‌ నాటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు వివరించాడు.  

చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దిగ్గజ అంపైర్‌
T20 World Cup 2022: నెదర్లాండ్స్‌తో పోరు.. టీమిండియాలో మూడు మార్పులు..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top