Ranji Trophy 2022: అపూర్వ విజయం.. అద్భుతంగా సాగిన మధ్య ప్రదేశ్‌ గెలుపు ప్రస్థానం

Ranji Trophy: Road of Madhya Pradesh to maiden title - Sakshi

ఏప్రిల్‌ 1999... ఇదే బెంగళూరు, ఇదే చిన్నస్వామి స్టేడియం... కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు 75 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 247 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించే క్రమంలో చివరి రోజు ఆలౌట్‌ కాకుండా జాగ్రత్తగా ఆడుకుంటే టైటిల్‌ దక్కేది. కానీ అనూహ్యంగా కుప్పకూలిన మధ్యప్రదేశ్‌ మ్యాచ్‌ మరో 5.1 ఓవర్లు మిగిలి ఉండగా ఆలౌటైంది. అయితే ఈ సారి ఆ జట్టు ఎలాంటి తప్పూ చేయలేదు. భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత కూడా పట్టు జారకుండా చూసుకుంది. తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలిచింది. నాడు కెప్టెన్‌గా ఓటమి వేదన అనుభవించిన చంద్రకాంత్‌ పండిత్‌ 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే మధ్యప్రదేశ్‌ కోచ్‌గా విజయానందాన్ని ప్రదర్శించాడు! సీజన్‌ తొలి మ్యాచ్‌ నుంచి విజేతగా నిలిచే వరకు ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనతో పాటు కోచ్‌గా చంద్రకాంత్‌ దూరదృష్టి, వ్యూహాలు టీమ్‌ను ముందుకు నడిపించాయి. 

నరేంద్ర హిర్వాణీ, రాజేశ్‌ చౌహాన్, అమయ్‌ ఖురాసియా, నమన్‌ ఓజా, దేవేంద్ర బుందేలా, జలజ్‌ సక్సేనా... సుదీర్ఘ కాలం పాటు మధ్యప్రదేశ్‌ జట్టుకు ఆడి తమ సర్వస్వం ధారబోసినా రంజీ టైటిల్‌ విజయాన్ని మాత్రం వారంతా రుచి చూడలేకపోయారు. జట్టును ఈ స్థాయికి చేర్చడంలో ఇన్నేళ్లలో వీరంతా కీలక పాత్ర పోషించారు. వారంతా గర్వపడే క్షణమిది. తాజా సీజన్‌లో ముగ్గురు బ్యాటర్లు ప్రధానంగా జట్టు భారాన్ని మోశారు. ఐపీఎల్‌ ప్రదర్శన గాలివాటం కాదని నిరూపిస్తూ రజత్‌ పటిదార్‌ (మొత్తం 658 పరుగులు) అందరికంటే ముందుండగా... యశ్‌ దూబే (614), శుభమ్‌ శర్మ (608) దేశవాళీ క్రికెట్‌లో ఇప్పుడు తమపై దృష్టి పడేలా చేసుకున్నారు. హిమాన్షు మంత్రి (375) కీలక సమయాల్లో రాణించగా, కోచ్‌ నమ్మకముంచిన 18 ఏళ్ల అక్షత్‌ రఘువంశీ 6 ఇన్నింగ్స్‌లలోనే 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో 295 పరుగులు చేయడం విశేషం.

బౌలింగ్‌లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కుమార్‌ కార్తికేయ (32 వికెట్లు), పేసర్‌ గౌరవ్‌ యాదవ్‌ (23 వికెట్లు) ఆరంభంలోనే వికెట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. విడిగా చూస్తే ఏ ఒక్కరూ అసాధారణ ఆటగాళ్లు కాదు. కానీ జట్టుగా, సమష్టిగా వీరంతా సత్తా చాటడంతో మధ్యప్రదేశ్‌ టీమ్‌ కల నెరవేరింది. భారత జట్టుకు ఎంపిక కావడంతో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్, అవేశ్‌ ఖాన్‌ టీమ్‌కు దూరమైనా ఆ ప్రభావం పడకుండా కుర్రాళ్లు చూసుకోగలిగారు. మైదానంలో జట్టులో స్ఫూర్తి నింపడంలో కెప్టెన్‌ ఆదిత్య శ్రీవాస్తవది కూడా కీలక పాత్ర. 

‘నేను ఒక ప్లేయర్‌ను చెంపదెబ్బ కొట్టినా దానికో కారణం ఉంటుంది. ఆటగాడు కూడా అర్థం చేసుకుంటాడు. ఇది నా కోచింగ్‌ శైలి’ అంటూ చంద్రకాంత్‌ పండిత్‌ చెప్పుకున్నారు. టైమ్‌ మేనేజ్‌మెంట్, ప్రణాళికలు, సన్నద్ధత విషయంలో ఆయన ఇచ్చిన ‘బ్లూ ప్రింట్‌’ను జట్టు సభ్యులు సమర్థంగా అమలు చేశారు. వికెట్‌ కీపర్‌గా భారత్‌ తరఫున 5 టెస్టులు, 36 వన్డేలు ఆడిన పండిత్‌ కోచింగ్‌ రికార్డు అద్భుతం. ముంబై చివరిసారి విజేతగా నిలిచిన 2015–16 సీజన్‌లో ఆయన ఆ టీమ్‌కు కోచ్‌గా ఉన్నారు.

రంజీ దిగ్గజ జట్టే కాదు ఎలాంటి టీమ్‌నైనా నేను నడిపించగలను అన్నట్లుగా చాలెంజ్‌ చేస్తూ విదర్భ టీమ్‌కు పండిత్‌ వెళ్లారు. అప్పటి వరకు దిగువ స్థాయికే పరిమితమవుతూ గుర్తింపే లేని విదర్భ కూడా ఆయన మార్గనిర్దేశనంలో తొలి టైటిల్‌ సాధించడంతో పాటు తర్వాతి ఏడాది దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఇప్పుడు కూడా అదే తరహాలో తొలి ప్రయత్నంలోనే జట్టును విజేతగా నిలపగలిగారు. తాజా గెలుపుతో మున్ముందు భారత దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌ మరింతగా దూసుకుపోవడం ఖాయం. 
చదవండి: Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ 2022లో అదరగొట్టిన హీరోలు వీళ్లే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top