Ranji Trophy: హైదరాబాద్‌ బతికిపోయింది!

Ranji Trophy: Bad light robs Tamil Nadu of a thrilling win over Hyderabad - Sakshi

త్రుటిలో తమిళనాడు చేజారిన విజయం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తమిళనాడు విజయలక్ష్యం 144 పరుగులు...అదీ 11 ఓవర్లలో...అంటే ఓవర్‌కు 13కు పైగా పరుగులు...సాధారణంగానైతే రంజీ ట్రోఫీలో ఇలాంటి స్థితిలో కష్టసాధ్యమైన లక్ష్యం కాబట్టి ఇరు జట్ల కెప్టెన్లు ‘షేక్‌హ్యాండ్‌’తో ‘డ్రా’కు సిద్ధమవడం సహజం. కానీ తమిళనాడు భిన్నంగా ఆలోచించింది. టి20 తరహాలో ఛేదనకు సిద్ధమై అంతకంటే వేగంగా పరుగులు సాధించింది. 7 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 108 పరుగులు (ఓవర్‌కు 15.42 పరుగుల చొప్పున) చేసింది. ఎన్‌.జగదీశన్‌ (22 బంతుల్లో 59 నాటౌట్‌; 8 సిక్సర్లు), సాయి సుదర్శన్‌ (20 బంతుల్లో 42; 5 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు.

ఉప్పల్‌ స్టేడియంలో సిక్సర్లతో పండగ చేసుకున్నారు. 24 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన ఈ దశలో ఖాయంగా తమిళనాడు గెలుస్తుందనిపించింది. అయితే హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చింది.  వెలుతురు తగ్గిందంటూ ‘రీడింగ్‌’ చూసి అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. దాంతో మ్యాచ్‌ డ్రా కాగా, తమిళనాడు బ్యాటర్లు నిరాశగా వెనుదిరిగారు. వెలుతురులేని తమకు అనుకూలంగా మారుతుందని ఊహించిన హైదరాబాద్‌ ‘వ్యూహాత్మకంగానే’ చివర్లో సమయం వృథా చేసింది. ఫీల్డర్లందరూ బౌండరీ వద్ద చేరగా, లాంగాఫ్‌నుంచి కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ బంతి బంతికీ బౌలర్‌ వద్దకు వచ్చి సూచనలు ఇస్తూ పోయాడు. ఒక దశలో సిక్సర్‌గా మారిన బంతిని వెనక్కి ఇవ్వడంలో హైదరాబాద్‌ ఫీల్డర్లు బాగా ఆలస్యం చేస్తుండటంతో తమిళనాడు ఆటగాళ్లే స్టాండ్స్‌లోకి వెళ్లిపోయి బంతులు అందించారు. కానీ చివరకు ఫలితం మాత్రం రాలేదు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కో రు 28/0తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top