పంజాబ్‌ ‘టాప్‌’ షో | Punjab Kings beat Mumbai by 7 wickets | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ ‘టాప్‌’ షో

Apr 17 2026 4:03 AM | Updated on Apr 17 2026 12:58 PM

Punjab Kings beat Mumbai by 7 wickets

మెరిసిన ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్‌ అయ్యర్‌ 

ముంబైపై 7 వికెట్లతో ఘన విజయం 

డికాక్‌ సెంచరీ వృథా

ముంబై: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల జోరు తోడవడంతో... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అజేయంగా సాగుతోంది. గురువారం జరిగిన పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. నాలుగో విజయంతో పంజాబ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరగా... ముంబై వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (60 బంతుల్లో 112 నాటౌట్‌; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే డికాక్‌ దుమ్మురేపాడు. నమన్‌ ధీర్‌ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 68 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. 

గాయం కారణంగా  రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... రికెల్టన్‌ (2), సూర్యకుమార్‌ యాదవ్‌ (0), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (14), రూథర్‌ఫోర్డ్‌ (1) విఫలమయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్ దీప్ సింగ్‌ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (39 బంతుల్లో 80; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచి కొట్టడంతో లక్ష్యం చిన్నబోయింది.  

బాదుడే... బాదుడు 
బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్‌ బ్యాటర్లు తొలి ఓవర్‌ నుంచే ముంబై బౌలర్లపై చెలరేగారు. దీపక్‌ చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 2 ఫోర్లు కొడితే, ప్రియాన్ష్ ఆర్య (15; 2 ఫోర్లు, 1 సిక్స్‌) 6, 4 బాదాడు. దీంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్యతో పాటు కూపర్‌ కనోలి (17; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ని గజన్‌ఫర్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేయగా... ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది శ్రేయస్‌ తన ఉద్దేశం చాటాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 61/2తో నిలిచింది. 

ఆ తర్వాత శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్‌ జోరు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీపక్‌ ఓవర్‌లో 6, 4 కొట్టిన ప్రభ్‌సిమ్రన్‌... హార్దిక్‌ ఓవర్‌లో రెండు, శార్దుల్‌ ఓవర్‌లో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌ నుంచి శ్రేయస్‌ కూడా దూకుడు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌లతో అలరించిన శ్రేయస్‌ 31 బంతుల్లో పిఫ్టీ మార్క్‌ అందుకున్నాడు. శార్దుల్‌ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన శ్రేయస్‌ మరో భారీ షాట్‌ కొట్టే యత్నంలో అవుటైనా... అప్పటికే పంజాబ్‌ గెలుపు ఖాయమైంది.  

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) శశాంక్‌ (బి) అర్ష్ దీప్ 2; డికాక్‌ (నాటౌట్‌) 112; సూర్యకుమార్‌ (సి) చాహల్‌ (బి) అర్ష్ దీప్ 0; నమన్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) శశాంక్‌ 50; హార్దిక్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) యాన్సెన్‌ 14; రూథర్‌ఫోర్డ్‌ (బి) అర్ష్ దీప్ 1; తిల్‌ (రనౌట్‌) 8; మయాంక్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–134, 4–175, 5–182, 6–193. బౌలింగ్‌: అర్ష్ దీప్ సింగ్‌ 4–0–22–3; యాన్సెన్‌ 4–0–30–1; బార్ట్‌లెట్‌ 4–0–39–0; వైశాక్‌ 3–0–36–0; యుజ్వేంద్ర చాహల్‌ 3–0– 45–0; శశాంక్‌ సింగ్‌ 2–0–19–1. 

 

 

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) దీపక్‌ (బి) గజన్‌ఫర్‌ 15; ప్రభ్‌సిమ్రన్‌ (నాటౌట్‌) 80; కూపర్‌ (సి) డికాక్‌ (బి) గజన్‌ఫర్‌ 17; శ్రేయస్‌ (సి) నమన్‌ (బి) శార్దుల్‌ 66; స్టొయినిస్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–27, 2–45, 3–184. బౌలింగ్‌: దీపక్‌  2.3–0–45–0; బుమ్రా 4–0–41–0; గజన్‌ఫర్‌ 4–0–31–2; హార్దిక్‌ 3–0–39–0; శార్దుల్‌ 3–0–42–1.    

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ X  కోల్‌కతా 
వేదిక: అహ్మదాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement