పంజాబ్‌ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్‌ పాఠాలు! | Punjab CM Bhagwant Mann meets former Netherlands player | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్‌ పాఠాలు!

Apr 22 2026 12:50 AM | Updated on Apr 22 2026 12:50 AM

Punjab CM Bhagwant Mann meets former Netherlands player

నెదర్లాండ్స్‌ మాజీ ప్లేయర్‌తో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ భేటీ

చండీగఢ్‌: నెదర్లాండ్స్‌ హాకీ దిగ్గజం ఫ్లోరిస్‌ జాన్‌ బోవెలాండర్‌తో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు రాష్ట్రంలో హాకీని మరింత బలోపేతం చేయడానికి బోవెలాండర్‌ సేవలను వినియోగించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్న భగవంత్‌ మాన్‌... ఇందులో భాగంగా హాకీపై బోవెలాండర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. హాకీకి పునరై్వభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. 

ఈ సందర్భంగా బోవెలాండర్‌ అసాధారణ ప్రతిభను మాన్‌ ప్రశంసించారు. ఆయన క్రీడా ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి పంజాబ్‌ ఆతిథ్యమివ్వనుంది. ప్లేయర్ల నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు పంజాబ్‌కు రావాల్సిందిగా బోవెలాండర్‌ను భగవంత్‌ మాన్‌ ఆహ్వానించారు. దీనికి డచ్‌ దిగ్గజం సుముఖత వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు బోవెలాండర్‌ భారత్‌కు రానున్నట్లు మాన్‌ వెల్లడించారు. 

‘క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, హాకీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పంజాబ్‌ కట్టుబడి ఉంది. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి తొలిసారి పంజాబ్‌ ఆతిథ్యమివ్వనుంది. భారత హాకీలో ఎప్పటి నుంచో పంజాబ్‌ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 50 మందికి పైగా పంజాబ్‌ ప్లేయర్లు హాకీలో ఒలింపిక్‌ పతకాలు సాధించారు. పది మందికిపైగా పంజాబ్‌ ప్లేయర్లు విశ్వక్రీడల్లో దేశానికి నాయకత్వం వహించారు. 

పంజాబీ ప్లేయర్‌ లేకుండా భారత హాకీ జట్టును ఊహించడం కష్టం. పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులోనూ పది మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఘనచరిత్ర ఉన్న ప్లేయర్లకు దిశానిర్దేశం చేసేందుకు నెదర్లాండ్స్‌ హాకీ దిగ్గజం బోవెలాండర్‌ అంగీకరించారు. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఆయన మన ప్లేయర్లలో స్ఫూర్తినింపనున్నారు’ అని భగవంత్‌ మాన్‌ వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement