2027 వన్డే ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు
అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు సీనియర్లంతా బరిలోకి
సీజన్ అసాంతం సెలక్టర్లంతా బిజీ బిజీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ టి20 టోర్నీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కానీ సెలక్టర్ల బృందం తాము ఎంపిక చేసిన ప్రపంచకప్ ప్రాబబుల్స్ సైన్యం ఆటతీరు కోసం ఎలా ఉంటుందోనని పర్యవేక్షించనుంది. పది ఫ్రాంచైజీలు 2026–ఐపీఎల్ ట్రోఫీపై కన్నేస్తే... ఐదుగురు జాతీయ సెలక్టర్లు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌కు దీటైన జట్టును ఎంపిక చేసే పనిలో పడింది. ఐపీఎల్ టోర్నీ ఫార్మాట్... వరల్డ్‌కప్ ఫార్మాట్ వేరైనా... ఇప్పటికే సిద్ధం చేసుకున్న 20 మంది భారత ప్రపంచకప్ ప్రాబబుల్స్‌పై సెలక్షన్ కమిటీ కన్నేసింది.
ఇందుకోసం వారం రోజుల్లో మొదలయ్యే మెరుపుల లీగ్‌పై ప్రతీ సెలక్టర్ ఉమ్మడి బాధ్యత తీసుకున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఈ బృందంలో శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా సెలక్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ ప్రాబబుల్స్ జాబితాలోని ఆటగాడు ఆడే ఐపీఎల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి వెళ్లనున్నారు.
ఇలా ఐదుగురు సెలక్టర్లు వారంలో ఐదు రోజులు ఇదేపనిపై ఉంటారు. వంతుల వారీగా ఒకరైతే తప్పనిసరిగా స్టేడియానికి వెళితే... మిగతా నలుగురు టీవీల్లో ప్రాబబుల్స్ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించనున్నారు. ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది.
పూర్తిస్థాయి జట్టుతో...
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా లేదు. డబ్ల్యూటీసీలో లేకపోయినా... ప్రత్యర్థి బలహీనమైన జట్టే అయినా సెలక్టర్లు పూర్తిస్థాయి టీమిండియానే బరిలోకి దించాలని భావిస్తున్నారు. సీనియర్లు, కీలకమైన ఆటగాళ్లెవరికీ విశ్రాంతి ఇవ్వకుండా అందరిని మైదానంలో ఆడించేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఎందుకంటే ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు ఇంకా 9 టెస్టులు మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో మేటి జట్లను ఎదుర్కొనేందుకు దీటుగా ప్రతీ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సెలక్షన్ కమిటీ చూస్తోంది. దీంతో ప్రీమియం సీమర్ బుమ్రాతో పాటు టెస్టుల్లో రెగ్యులర్ బౌలరైనా హైదరాబాదీ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపిక చేయనుంది.
అగార్కర్ పొడిగింపు కోరలేదు
సీనియర్ సెలక్షన్ కమిటీకి మాజీ సీమర్ అజిత్ అగార్కర్ చైర్మన్‌గా ఉన్నాడు. 2023, జూలైలో చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అతని పదవీ కాలం ఈ సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు టి20 ప్రపంచకప్‌లకు విజయవంతమైన జట్లను ఎంపిక చేసిన అగార్కర్ పదవీ కాలం పొడిగింపు కోరినట్లు వార్తలు ఊపందుకున్నాయి. కానీ బోర్డు సీనియర్ అధికారి ఒకరు ఈ ఊహాగానాలను తొసిపుచ్చారు. అతని పదవీ కాలం ముగియలేదని, అప్పటి వరకు అతనే చీఫ్ సెలక్టర్ అని ఆ తర్వాతే అగార్కర్, బోర్డు కార్యదర్శి కలిసి ఓ నిర్ణయానికి వస్తారని ఆయన చెప్పారు.


