ప్రపంచ క్రికెట్లో వీళ్ళే మొనగాళ్లు.. వీళ్లతో చాలా కష్టం 

Pat Cummins Reveals About Toughest Batsmen In The World - Sakshi

సిడ్నీ: ప్రపంచ క్రికెట్‌లో కఠినమైన ఆటగాడెవరని ఆసీస్ బౌలింగ్ అల్ రౌండర్ పాట్ కమిన్స్ ను ప్రశ్నించగా.. అతను ఓ ఐదుగురు పేర్లు చెప్పాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో జో రూట్, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, ఏ బీ డివిలియర్స్, కేన్ విలియమ్సన్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని, ఈ ఐదుగురు బ్యాట్స్ మెన్లు ప్రపంచ క్రికెట్లో మొనగాళ్ళని ఆకాశానికెత్తాడు. వీరికి ఎటువంటి వీక్నెస్ లు లేకపోవడంతో సహజంగానే వీరికి బౌలింగ్ చేయడం చాలా కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పైగా ఈ ఐదుగురు బ్యాట్స్ మెన్లు ఎదురు దాడి చేయడంలో దిట్టలని, అందుకే బౌలర్లు వీరితో పోటీ పడేందుకు జంకుతారని చెప్పుకొచ్చాడు. 

అలాగే ప్రతి జట్టులో ఒకరిద్దరు కఠినమైన ఆటగాళ్లు ఉన్నారని, ఇంగ్లండ్లో రూట్, స్టోక్స్.. భారత్‌లో కోహ్లి, పూజారా..  దక్షిణాఫ్రికాలో డివిలియర్స్ , డుప్లెసిస్ లాంటి ఆటగాళ్ల వికెట్లు చాలా విలువయినవని పేర్కొన్నాడు. కాగా, కమిన్స్ ప్రకటించిన టఫెస్ట్ ఆటగాళ్ల జాబితాలో సహచర క్రికెటర్లైన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనార్హం. 2011లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కమిన్స్.. 34 టెస్టులు, 69 వన్డేలు, 30 టీ 20 మ్యాచ్లు ఆడి వరుసగా 164, 111, 37 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్ లోయర్ ఆర్డర్లో ఉపయుక్తమైన బ్యాట్స్ మెన్ గాను రాణించి, ప్రస్తుత తరంలో ఉత్తమ బౌలింగ్ అల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  

కాగా, ఇదే సందర్బంగా కమిన్స్ భారత్ లోని పిచ్‌లపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లలో పిచ్‌లు పేసర్లకు ఎలా సకరిస్తాయో, అలానే  భారత్లో స్పిన్నర్లకు తోడ్పడతాయన్నాడు. ఈ విషయమై పేసర్లు అతిగా ఆలోచించకుండా, పేస్ రాబట్టడంపై దృష్టి సారిస్తే సత్ఫాలితాలు వస్తాయని సూచించాడు. వేగంతో  పాటు రెండు వైపులా స్వింగ్‌ను రాబట్ట గల సమర్థుడైన ఈ కేకేఆర్ అల్ రౌండర్, ఇటీవల ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  
చదవండి: ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆ దేశ ఆటగాళ్లు దూరం..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top