టీ20 ప్రపంచకప్‌కు పాక్‌ జట్టు ప్రకటన | Pakistan Squad For T20 World Cup 2026 Announced, Fatima Sana Named Captain | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌కు పాక్‌ జట్టు ప్రకటన

May 16 2026 2:48 PM | Updated on May 16 2026 2:55 PM

Pakistan Squad For T20 World Cup 2026 Announced, Fatima Sana Named Captain

ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ వేదికగా జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం 15 సభ్యుల పాకిస్తాన్‌ జట్టును ఇవాళ (మే 16) ప్రకటించారు.  ఈ జట్టుకు కెప్టెన్‌గా ఫాతిమా సనాను నియమించారు. వరుసగా రెండోసారి సనానే టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టును నడిపించనుంది.

ఈ పాక్‌ జట్టులో పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్నారు. ఎమాన్‌ ఫాతిమా, నతాలియా పర్వేజ్‌, రమీన్‌ షమీమ్‌, సైరా జబీన్‌, తస్మియా రుబాబ్‌కు ఇదే తొలి వరల్డ్‌కప్‌.

మెగా టోర్నీలో పాక్‌ గుల్‌ ఫిరోజా, మునీబా అలీ, అయేషా జాఫర్‌పై భారీ ఆశలు (బ్యాటింగ్‌లో) పెట్టుకుంది. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో ఆయేషా జాఫర్‌, ఫాతిమా సనా మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు అదనంగా కలిసొచ్చే అంశం.

స్పిన్‌ విభాగంలో సదియా ఇక్బాల్‌, నష్రా సంధు, తుబా హసన్‌ కీలక పాత్ర పోషించనుండగా.. పేస్‌ విభాగాన్ని ఫాతిమా సనా, డయానా బేగ్‌ ముందుండి నడిపించనున్నారు.

ఈ ప్రపంచకప్‌లో పాక్‌ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ వంటి బలమైన జట్లు ఉన్నాయి.

పాక్‌ జట్టు జూన్‌ 14న బర్మింగ్‌హామ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ఆడనుంది.

గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు ముందు పాక్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. జూన్‌ 6న శ్రీలంకతో, జూన్‌ 9న స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు డెర్బీ వేదికగా జరుగనున్నాయి.

ప్రపంచకప్‌కు ముందు పాక్‌..వెస్టిండీస్‌తో కలిసి ఐర్లాండ్‌లో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొననుంది. ఈ టోర్నీలో మే 29న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న పాక్‌, మే 31న ఐర్లాండ్‌ను ఎదుర్కొంటుంది. అనంతరం జూన్‌ 3న మళ్లీ వెస్టిండీస్‌తో, జూన్‌ 4న ఐర్లాండ్‌తో తలపడుతుంది. ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ టోర్నీలోనూ కొనసాగనుంది. కాగా, తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో పాక్‌ ఘన విజయాలు సాధించింది. ఈ రెండు సిరీస్‌లను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

పాక్‌ జట్టు: ఫాతిమా సనా (సి), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (WK), నష్రా సంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీ, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, తస్మియా రుబాబ్, తస్మియా రుబాబ్

రిజర్వ్‌లు: అంబర్ కైనాట్, మోమినా రియాసత్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా మరియు ఉమ్-ఎ-హని

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement