ఈసారి బంతితో మ్యాజిక్‌ చేసిన రచిన్‌ రవీంద్ర

NZ VS SA 2nd Test: South Africa 6 Down For 220 On Day Stumps - Sakshi

న్యూజిలాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర ఫార్మాట్లకతీతంగా ఇరగదీస్తున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన రచిన్‌.. తాజాగా టెస్ట్‌ ఫార్మాట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో బ్యాట్‌తో (డబుల్‌ సెంచరీ) చెలరేగిన రచిన్‌.. ఇవాళ (ఫిబ్రవరి 13) మొదలైన రెండో టెస్ట్‌లో బంతితో మ్యాజిక్‌ చేశాడు.

రచిన్‌ 3 వికెట్లతో రాణించడంతో పర్యాటక సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రచిన్‌తో పాటు మ్యాట్‌ హెన్రీ (1/48), విలియమ్‌ రూర్కీ (1/47), నీల్‌ వాగ్నర్‌ (1/28) వికెట్లు తీశారు. 150 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికాను రుయాన్‌ డి స్వార్డ్ట్‌ (55), షాన్‌ వాన్‌ బెర్గ్‌ (34) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజ్‌లోనే ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో నీల్‌ బ్రాండ్‌ 25, క్లైడ్‌ ఫోర్టిన్‌ 0, రేనార్డ్‌ వార్‌ టోండర్‌ 32, జుబేర్‌ హంజా 20, డేవిడ్‌ బెడింగ్హమ్‌ 39,  కీగన్‌ పీటర్సన్‌ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కాగా, ఈ సిరీస్‌లోని జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌ 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో రచిన్‌ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో విరుచుకుపడగా.. కేన్‌ విలియమ్సన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్ట్‌లో రచిన్‌ బంతితోనూ (2 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును పంపించి చేతులుకాల్చుకుంది.

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top