ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో త్వరలో జరుగబోయే టెస్ట్ సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న (మే 6) ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్‌గా టామ్ లాథమ్ నియమితుడు కాగా.. గాయాల నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్లు కైల్ జేమీసన్, విలియమ్ ఓ రూర్కీ, వెటరన్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చారు.
రెండేళ్ల తర్వాత అవకాశం
2024 ఫిబ్రవరిలో వెన్నెముక గాయం కారణంగా టెస్టులకు దూరమైన కైల్ జేమీసన్ ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. 19 టెస్టుల్లో 80 వికెట్లు తీసి అద్భుత రికార్డు కలిగిన జేమీసన్‌పై న్యూజిలాండ్ జట్టుకు భారీ అంచనాలు ఉన్నాయి.
24 ఏళ్ల రూర్కీ సైతం గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. అతడు ఇప్పటికే 11 టెస్టుల్లో 39 వికెట్లు సాధించి మంచి జోరుమీదున్నాడు. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇటీవలికాలంలో తరుచూ గాయాల బారిన పడుతూ జట్టులోకి వచ్చీ పోతున్నాడు. రాబోయే సిరీస్‌ల్లో కేన్ కూడా న్యూజిలాండ్‌కు కీలకం కానున్నాడు.
బలమైన పేస్ దళం
ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ భారీ పేస్ దళాన్ని ఎంపిక చేసింది. జట్టులో మ్యాట్ హెన్రీ, జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ లాంటి భయంకరమైన పేసర్లు ఉన్నారు.
తొలి పిలుపు
సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌కు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం లభించింది. డీన్.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
కీలక గైర్హాజరీలు
- జేకబ్ డఫీ తన తొలి బిడ్డ జననం కారణంగా ఎంపికకు అందుబాటులో లేడు.
- మైఖేల్ బ్రేస్‌వెల్ టెస్టు క్రికెట్‌కు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
- మిచెల్ సాంట్నర్ భుజ గాయం నుంచి కోలుకుంటున్నాడు.
కాగా, న్యూజిలాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఐర్లాండ్.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్ బెల్‌ఫాస్ట్ వేదికగా మే 27న మొదలు కానుండగా.. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌లు లార్డ్స్, కెన్నింగ్టన్ ఓవల్, ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికలుగా జూన్ 4, 17, 25 తేదీలోల ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఈ రెండు సిరీస్‌లను కీలకంగా భావిస్తోంది. ముందున్న భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని బలమైన జట్టును సిద్ధం చేసుకుంటుంది.
ఐర్లాండ్ టెస్ట్ కోసం న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ క్లార్క్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, రాచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్*, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్
ఇంగ్లాండ్ పర్యటనకు ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్


