
చోర్జో (పోలాండ్): ఈ సీజన్‌లో తాను పాల్గొన్న రెండో ఈవెంట్‌లోనూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన జానుస్ కుసోన్‌స్కీ స్మారక అథ్లెటిక్స్ మీట్‌లో నీరజ్ చోప్రా చివరిదైన ఆరో ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల నీరజ్ చివరి ప్రయత్నంలో జావెలిన్‌ను 84.14 మీటర్ల దూరం విసిరి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈనెల 16న జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్‌లోనూ నీరజ్ రెండో స్థానాన్ని సాధించాడు.
దోహా డైమండ్ లీగ్ మీట్‌లో అగ్రస్థానంలో నిలిచిన జూలియన్ వెబెర్ (జర్మనీ) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. జూలియన్ వెబెర్ జావెలిన్‌ను 86.12 దూరం విసిరి తొలి స్థానాన్ని పొందగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 83.24 మీటర్లు) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 81.28 మీటర్ల దూరం విసిరాడు.
ఆ తర్వాత మూడు, నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన నీరజ్ ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 81.80 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత చివరి ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకొని రెండో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.