సివర్‌ జోరు... వాంగ్‌ హోరు

Mumbai Indians defeated UP Warriorz by 72 runs in the Eliminator - Sakshi

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీపై గెలుపు 

సివర్‌ మెరుపులు

ఇసీ వాంగ్‌ ‘హ్యాట్రిక్‌’

ఆదివారం ఫైనల్లో ఢిల్లీతో ముంబై ‘ఢీ’  

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ లో ఆరంభ అంచనాలను నిజం చేస్తూ ముంబై ఇండియన్స్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్‌ దశ చివర్లో కాస్త తడబడినా... తమ స్థాయిని ప్రదర్శిస్తూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం శుక్రవారం జరిగిన ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 72 పరుగులతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

బ్యాటింగ్‌లో నాట్‌ సివర్‌ బ్రంట్‌ చెలరేగగా, బౌలింగ్‌ ఇసీ వాంగ్‌ లీగ్‌లో తొలి ‘హ్యాట్రిక్‌’తో సత్తా చాటింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నాట్‌ సివర్‌ (38 బంతుల్లో 72 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించగా... అమేలియా కెర్‌ (19 బంతుల్లో 29; 5 ఫోర్లు) చివర్లో దూకుడుగా ఆడింది.

అనంతరం యూపీ 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కిరణ్‌ నవ్‌గిరే (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కెపె్టన్‌ అలీసా హీలీ పుట్టిన రోజునాడు ఓటమిని ఎదుర్కొన్న యూపీ టోర్నీని మూడో స్థానంతో ముగించగా... ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడుతుంది.  

సివర్‌ దూకుడు... 
ముంబై ఇన్నింగ్స్‌ మొత్తంలో నాట్‌ సివర్‌ ఆట చుక్కానిలా నిలిచింది. వరుసగా నాలుగు కీలక భాగస్వామ్యాలతో ఆమె జట్టుకు భారీ స్కోరును అందించడంలో సఫలమైంది. తొలి బంతికే ఫోర్‌తో యస్తిక భాటియా (18 బంతుల్లో 21; 4 ఫోర్లు)  ఆటను మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత యస్తికను అంజలి శర్వాణి వెనక్కి పంపించింది.

ఆ తర్వాత హేలీ మాథ్యూస్‌ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జత కలసింది. హేలీ తనదైన శైలిలో ధాటిగా ఆడలేక విఫలం కాగా, ఎకెల్‌స్టోన్‌ చక్కటి బంతికి హర్మన్‌ప్రీత్‌ (14) అవుటైంది. అయితే మరో ఎండ్‌లో మాత్రం సివర్‌ తన జోరు కొనసాగించింది. పార్శవి ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన ఆమె 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి 2 ఓవర్లలో ముంబై 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టడం విశేషం.  

టపటపా... 
కిరణ్‌ నవ్‌గిరే ఇన్నింగ్స్‌ మినహా యూపీ ఆటలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది. ఇషాక్‌ ఓవర్లో కిరణ్‌ 3 ఫోర్లు, 1 సిక్స్‌ బాదడమై హైలైట్‌. కీలక ప్లేయర్లు అలీసా హీలీ (11), తాలియా మెక్‌గ్రాత్‌ (7), గ్రేస్‌ హారిస్‌ (14) విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది.

56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో వరుస మూడు బంతుల్లో నవ్‌గిరే, సిమ్రన్‌ షేక్, సోఫీ ఎకెల్‌స్టోన్‌లను అవుట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ సాధించింది. వాంగ్‌ దెబ్బకు యూపీ ఓటమి లాంఛనమే అయింది.  

స్కోరు వివరాలు  
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: యస్తిక (సి) నవ్‌గిరే (బి) అంజలి 21; హీలీ మాథ్యూస్‌ (సి) నవ్‌గిరే (బి) పార్శవి 26; నాట్‌ సివర్‌ (నాటౌట్‌) 72; హర్మన్‌ప్రీత్‌ (బి) ఎకెల్‌స్టోన్‌ 14; అమేలియా కెర్‌ (సి) అంజలి (బి) ఎకెల్‌స్టోన్‌ 29; పూజ వస్త్రకర్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–31, 2–69, 3–104, 4–164. బౌలింగ్‌: హారిస్‌ 3–0–20–0, అంజలి 3–0–17–1, రాజేశ్వరి 4–0–36–0, ఎకెల్‌స్టోన్‌ 4–0–39–2, దీప్తి శర్మ 4–0–39–0, పార్శవి చోప్రా 2–0–25–1.  
యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: హీలీ (సి) హర్మన్‌ (బి) వాంగ్‌ 11; శ్వేత (సి) మాథ్యూస్‌ (బి) ఇషాక్‌ 1; తాలియా (రనౌట్‌) 7; నవ్‌గిరే (సి) సివర్‌ (బి) వాంగ్‌ 43; హారిస్‌ (సి) వాంగ్‌ (బి) సివర్‌ 14; దీప్తి శర్మ (సి) కలిత (బి) మాథ్యూస్‌ 16; సిమ్రన్‌ (బి) వాంగ్‌ 0; ఎకెల్‌స్టోన్‌ (బి) వాంగ్‌ 0; అంజలి (బి) కలిత 5; రాజేశ్వరి (ఎల్బీ) (బి) ఇషాక్‌ 5; పార్శవి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్‌) 110. వికెట్ల పతనం: 1–8, 2–12, 3–21, 4–56, 5–84, 6–84, 7–84, 8–94, 9–104, 10–110. బౌలింగ్‌: నాట్‌ సివర్‌ 3–0–21–1, సైకా ఇషాక్‌ 2.4–1–24–2, వాంగ్‌ 4–0–15–4, అమేలియా 3–0–25–0, మాథ్యూస్‌ 3–0–21–1, అమన్‌జోత్‌ 1–0–2–0, కలిత 1–0–2–1.   

 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top