ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..

MS Dhoni International Cricket Career Begins With Runout In ODI Debut - Sakshi

ముంబై : ఈ దశాబ్దంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోజు ఇదే. డిసెంబర్‌ 23, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా ధోని క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రం మ్యాచ్‌ను మంచి మెమొరబుల్‌గా మలుచుకోవాలని ప్రతి ఒక్క ఆటగాడు భావిస్తాడు. కానీ ఎంఎస్‌ ధోనికి మాత్రం తొలి మ్యాచ్‌ ఒక పీడకలగా మిగిలిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో ధోని తాను ఆడిన తొలి బంతికే రనౌట్‌ అయి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తపష్‌ బైష్యా, ఖాలీద్‌ మసూద్‌లు కలిసి ధోనిని రనౌట్‌ చేశారు. (చదవండి : దీనిని 'క్యాచ్‌ ఆఫ్‌ ది సమ్మర్'‌ అనొచ్చా..)

తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేయడంపై అతను కొంత నిరుత్సాహం వ్యక్తం చేసినా... కొద్దిరోజుల్లోనే అతని విలువేంటనేది టీమిండియాకు అర్థమైంది. అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోని ధోని మంచి ఫినిషర్‌గా నిలిచాడు. అంతేగాక క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప కెప్టెన్ల సరసన చోటు సంపాదించాడు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోపీలను సాధించిపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు.

కానీ విచిత్రం ఏమిటంటే.. ధోని ఏ రనౌట్‌తో కెరీర్‌ను ప్రారంభించాడో యాదృశ్చికంగా అదే రనౌట్‌తో కెరీర్‌ను ముగించాడు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మార్టిన్‌ గప్టిల్‌ వేసిన డైరెక్ట్‌ త్రో ద్వారా రనౌట్‌ అయ్యాడు. తద్వారా మరోకప్‌ సాధించనున్నామనే భావనలో ఉన్న కోట్లాది మంది హృదయాలను విషాదంలోకి నెట్టాడు. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ బరిలోకి దిగలేదు. తన రిటైర్మెంట్‌పై ఎన్నో రకాల వార్తల వస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15, 2020న ధోని తన ట్విటర్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అతని అభిమానులను దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేశాడు. (చదవండి : 'పంత్‌కు కీపింగ్‌...సాహాకు బ్యాటింగ్‌ రాదు')

ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై దారుణ ప్రదర్శన కనబరించింది. ధోని కెప్టెన్సీలోని చెన్నై జట్టు 14 మ్యాచుల్లో 6 విజయాలు, 8 ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని ఐపీఎల్‌కు కూడా దూరమవుతాడని అంతా భావించారు. ఈ విషయంపై నేరుగా స్పందించిన ధోని.. 2021 ఐపీఎల్‌లో ఆడనున్నట్లు తానే స్వయంగా సంకేతాలు ఇచ్చాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ధోని టీమిండియా తరపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. ఇదే రోజుకు మరో విశేషం కూడా ఉంది. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు సాధించి చరిత్ర సృష్టించిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ వన్డేలకు ఇదే రోజు గుడ్‌బై చెప్పాడు.‌ 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top