క్రికెట్‌లోకి రీ ఎంట్రీ అన్నాడు.. అంతలోనే?

Mohammad Amir And Iftikhar Ahmed Get Involved In A Heated Altercation After Amir International Cricket Re Entry Statement - Sakshi

లాహోర్‌: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్‌ మహ్మద్ అమీర్.. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అమీర్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఇస్లామాబాద్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికార్ అహ్మద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. నువ్వెంతా? అంటే నువ్వెంతా అని కయ్యానికి కాలు దువ్వారు. చివరకు అంపైర్లు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.  

కాగా, 29 ఏళ్ల అమీర్.. పాక్‌ జట్టు మేనేజ్‌మెంట్ మానసిక వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ గతేడాది పాక్‌ క్రికెట్‌తో సంబంధాలు తెంచుకుని ఇంగ్లండ్‌కి వెళ్లి సెటిలయ్యాడు. అనంతరం బ్రిటీష్ సిటిజన్‌షిప్ పొం‍దాక ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నాలు ఆరంభించాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న పీసీబీ చీఫ్‌ వసీమ్‌ ఖాన్‌.. పీఎస్‌ఎల్‌ ఆడేందుకు పాక్‌కు వచ్చిన అమీర్‌తో చర్చలు ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని ఇంటికి స్వయంగా వెళ్లి.. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకునేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 2010లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా మహ్మద్ అమీర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
చదవండి: జడేజాపై మరోసారి అక్కసు వెల్లగక్కిన ప్రముఖ వ్యాఖ్యాత..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top