బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్‌ మన్హాస్‌! | Mithun Manhas set to take over as BCCI president | Sakshi
Sakshi News home page

బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్‌ మన్హాస్‌!

Sep 22 2025 4:12 AM | Updated on Sep 22 2025 4:12 AM

Mithun Manhas set to take over as BCCI president

నామినేషన్‌ వేసిన ఢిల్లీ మాజీ కెప్టెన్‌

బరిలో ఒకే ఒక్కడు 

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడు ఖరారయ్యాడు. ఏమాత్రం ఊహించని రీతిలో ఢిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మిథున్‌ మన్హాస్‌ బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశాడు. రోజర్‌ బిన్నీ పదవీకాలం గత నెలతో ముగియగా... అప్పటి నుంచి ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ నెల 28న ముంబై వేదికగా జరగనున్న బోర్డు సమావేశంలో ఆఫీస్‌ బేరర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. 

జమ్ముకశ్మీర్‌కు చెందిన 45 ఏళ్ల మిథున్‌ మన్హాస్‌... దేశవాళీల్లో ఢిల్లీ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఆదివారంతో నామినేషన్‌ల గడువు ముగియగా... అధ్యక్ష పదవికి మిథున్‌ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతడి ఎంపిక ఏకగ్రీవమైనట్లే. ఇక కోశాధికారిగా భారత మాజీ క్రికెటర్‌ రఘురామ్‌ భట్‌ ఎన్నిక కానున్నాడు. ప్రస్తుతం అతడు కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. శనివారం ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలోనే మన్హాస్‌ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. 

ఐసీసీ అధ్యక్షుడు జై షా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కార్యదర్శి దేవజిత్‌ సైకియా, ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు రోహన్‌ జైట్లీతో పాటు బోర్డు ప్రస్తుత, మాజీ కీలక సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో మన్హాస్‌ను అధ్యక్షుడిగా నియమించాలని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ‘కొత్త పాలక వర్గం ఏర్పాటవుతోంది. ఢిల్లీ మాజీ ఆటగాడు మిథున్‌ మన్హాస్‌ని అధ్యక్షుడిని చేయాలని నిర్ణయించారు. ఐపీఎల్‌ గవరి్నంగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా అరుణ్‌ ధుమాల్‌ కొనసాగుతారు’అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తెలిపాడు.  

» కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత కూడా ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్‌ సైకియా కొనసాగనున్నారు. ప్రస్తుతం బోర్డు కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన ప్రభ్‌తేజ్‌ భాటియా... తదుపరి సంయుక్త కార్యదర్శిగా పనిచేయనున్నాడు.  
» సౌరాష్ట్ర మాజీ కెపె్టన్‌ జయ్‌దేవ్‌ షా బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో భాగం కానున్నాడు. ఇప్పుడా స్థానంలో ఉన్న ఖైరుల్‌ జమాల్‌ మజుందార్‌ ఐపీఎల్‌ పాలక మండలికి వెళ్లనున్నాడు.  
» ప్రస్తుతం కార్యదర్శిగా కొనసాగుతున్న దేవజిత్‌ సైకియా అదే పోస్ట్‌కు ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశాడు. త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం రెండు రోజుల్లో జట్టును ఎంపిక చేయనున్నట్లు సైకియా తెలిపాడు.  
» భారత్, వెస్టిండీస్‌ మధ్య వచ్చే నెల 2 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025–27 సైకిల్‌లో టీమిండియాకు ఇదే మొదటి మ్యాచ్‌ కానుంది.  

ఎవరీ మన్హాస్‌...! 
అంచనాలకు అందకుండా అనూహ్యంగా తెరపైకి వచ్చిన మిథున్‌ మన్హాస్‌... బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా ఎంపికవడం ఖాయమైంది. పెద్దల అండదండలతో బరిలో నిలిచిన మన్హాస్‌కు పోటీనే లేకుండా పోయింది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న మిథున్‌... కెరీర్‌లో 157 మ్యాచ్‌లాడి 9714 పరుగులు చేశాడు. అందులో 27 సెంచరీలు ఉన్నాయి. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో 130 మ్యాచ్‌లాడి 4126 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 26 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. 91 టి20ల్లో 1170 పరుగులు చేశాడు. 

ఐపీఎల్‌లో మూడు (ఢిల్లీ క్యాపిటల్స్, పుణే వారియర్స్‌ ఇండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌) జట్లకు ప్రాతినిధ్యం వహించిన మన్హాస్‌... ఓవరాల్‌గా 55 మ్యాచ్‌లాడి 514 పరుగులు చేశాడు. 1997–98 సీజన్‌లో దేశవాళీ కెరీర్‌ ప్రారంభించిన మిథున్‌ 2016–17 వరకు కెరీర్‌ కొనసాగించాడు. కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన సమయంలో భారత జట్టు మిడిలార్డర్‌లో తీవ్రమైన పోటీ ఉండటంతో... అతడికి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశం దక్కలేదు. ఆటగాడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న మన్హాస్‌... ఆ తర్వాత కోచ్‌గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

క్రీడా పరిపాలనలోనూ అతడికి అనుభవం ఉంది. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ను గాడిన పెట్టేందుకు బీసీసీఐ నియమించిన కమిటీలో మిథున్‌ సభ్యుడిగా పనిచేశాడు. అందుకోసం 2015లో ఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్‌కు మారాడు. ఆ మరుసటి ఏడాదే కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆపై బంగ్లాదేశ్‌ పురుషుల అండర్‌–19 జట్టుకు బ్యాటింగ్‌ సలహాదారుడిగా పనిచేసిన మిథున్‌... ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌లో సహయ బృందంలో కీలకంగా వ్యవహరించాడు. 

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలువురు ప్లేయర్లు ఢిల్లీ జట్టులో మన్హాస్‌ సారథ్యంలో ఆడారని... అండర్‌–19 స్థాయిలో అతడితో కలిసి ఆడిన టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా గుర్తుచేసుకున్నాడు. రాహుల్‌ ద్రవిడ్, సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ వంటి హేమాహేమీలు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో మిడిలార్డర్‌లో చోటుదక్కకే మన్హాస్‌కు జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదని చోప్రా అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement