
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులో మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథున్ మన్హాస్ (Mithun Manhas) బీసీసీఐ కొత్త బాస్ కాబోతున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా రోజర్ బిన్నీ బీసీసీఐ (BCCI) అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష పదవిలో కొనసాగకూడదు. బిన్నీ ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టినందున.. నిబంధనలకు లోబడి రాజీనామా చేశారు. బిన్నీ స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కాబోయే అధ్యక్షుడిగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌తో పాటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తదితరుల పేర్లు వినిపించాయి. అయితే, సచిన్ ఈ వార్తలను ఇప్పటికే ఖండించాడు.
ఈ క్రమంలో మిథున్ మన్హాస్ కొత్తగా మీదకు వచ్చాడు. అతడితో పాటు మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె బోర్డులో చేరనున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబరు 28న జరిగే బీసీసీఐ సర్వ సభ్య సమావేశం సందర్భంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలనుంది.
ఎవరీ మిథున్ మన్హాస్?
జమ్ము కశ్మీర్‌కు చెందిన 45 ఏళ్ల మన్హాస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిలల్స్, పుణె వారియర్స్‌కు ఆడాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయకుండానే అతడి కెరీర్ ముగిసిపోయింది. ఒకవేళ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఖరారైతే.. టీమిండియాకు ఆడకుండానే బాస్ అయిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు.