
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. బీసీసీఐ అత్యున్నత పదవికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) 45 ఏళ్ల హర్భజన్‌ను నామినేట్ చేసినట్లు సమాచారం.
అయితే నామినేషన్ల అధికారిక జాబితా ఇక వెల్లడించలేదు. కానీ రాష్ట్ర క్రికెట్ సంఘం మద్దతు ఉన్న అభ్యర్థులు మాత్రమే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి అర్హులు. రోజర్ బిన్నీ పదవి కాలం ముగియడంతో ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడి పోస్ట్ ఖాళీగా ఉంది.
దీంతో ఈ నెలాఖరులో బీసీసీఐ ప్రెసిడెంట్ తో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారి ఏకే జోటి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20, 21 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు.
అభ్యర్థులు సెప్టెంబర్ 23 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 28న ఓటింగ్‌తో పాటు లెక్కింపు కూడా జరగనుంది. అదే రోజున బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పంజాబ్ క్రికెట్ బోర్డు ప్రతినిధిగా హర్భజన్ సింగ్ పాల్గోనున్నాడు.
అతడితో పాటు బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ తరపున భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం ఈ భేటీకి హాజరుకానున్నారు. వీరిద్దరితో పాటు పలు రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ ప్రతినిథులు పాల్గోనున్నారు. కాగా బీసీసీఐ ప్రెసిడెంట్ రేసులో భజ్జీతో పాటు కిరణ్ మోరే పేరు కూడా వినిపిస్తోంది.
ఈసారి బీసీసీఐ బాస్ పదవి వెస్ట్ జోన్ నుంచి దక్కే అవకాశముంది. కిరణ్ మోరే సౌరాష్ట్రకు చెందిన క్రికెటర్. ఇటీవలే సచిన్ టెండూల్కర్ పేరు కూడా అధ్యక్ష పదవికి వినిపించినప్పటికీ, ఆ వార్తలను ఆయన టీమ్ ఖండించింది. కానీ భజ్జీ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.
ఒకవేళ హర్భజన్‌సింగ్‌కే బీసీసీఐ అధ్యక్ష పదవి లభిస్తే.. ఈ బాధ్యతలు చేపట్టిన మూడో భారత క్రికెటర్‌గా నిలవనున్నాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ బీసీసీఐ బాస్‌గా పనిచేశారు.
ఇక భారత్ తరపున 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హర్భజన్, అన్ని ఫార్మాట్లలో కలిపి 700కు పైగా వికెట్లు పడగొట్టాడు. భజ్జీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున నామనేట్ అయ్యారు.
చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే: శుబ్‌మన్ గిల్