నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ అతడే: శుబ్‌మన్‌ గిల్‌ | Gill Reveals Toughest Bowler He Has faced amid Asia Cup 2025 | Sakshi
Sakshi News home page

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ అతడే: శుబ్‌మన్‌ గిల్‌

Sep 13 2025 12:24 PM | Updated on Sep 13 2025 12:41 PM

Gill Reveals Toughest Bowler He Has faced amid Asia Cup 2025

టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)తో కలిసి జీవితాంతం బ్యాటింగ్‌ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గిల్‌ భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.

ఆసియా కప్‌-2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా యూఏఈతో మ్యాచ్‌లో గిల్‌ ఆడాడు. తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్‌ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. తొమ్మిది బంతుల్లోనే 20 పరుగులతో అదరగొట్టాడు. 

తద్వారా  యూఏఈ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 4.3 ఓవర్లలోనే ఛేదించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గిల్‌ టీమిండియాతో కలిసి తదుపరి దాయాది పాకిస్తాన్‌ (సెప్టెంబరు 14)తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. 

ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ బ్రాడ్‌కాస్టర్‌ సోనీ స్పోర్ట్స్ గిల్‌ ర్యాపిడ్‌ ఫైర్‌ సెషన్‌లో పాల్గొన్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చాడు.

👉ఈ టోర్నమెంట్‌ కోసం మీరు ఎన్ని బ్యాట్లు తీసుకువచ్చారు?
😊గిల్‌: తొమ్మిది బ్యాట్లు
👉ఏ బ్యాటర్‌తో కలిసి జీవితాంతం బ్యాటింగ్‌ చేయాలని అనుకుంటున్నారు?
😊గిల్‌: ప్రస్తుతానికైతే అభిషేక్‌ శర్మతో కలిసి
👉మీరు ఏ ఆటగాడి నుంచైనా దొంగతనం చేయాలని అనుకునే నైపుణ్యం ఏమిటి?
😊గిల్‌: ఏబీ డివిలియర్స్‌ స్కూప్‌ షాట్‌
👉మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌?
😊గిల్‌: జేమ్స్‌ ఆండర్సన్‌ (ఇంగ్లండ్‌)
👉మీ క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యంత మధురమైన జ్ఞాపకం?
😊గిల్‌: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలవడం.
👉మీ చీట్‌ మీల్‌లో ఉండే ఫుడ్‌?
😊గిల్‌: ప్యాన్‌కేక్స్‌, బటర్‌ చికెన్‌, దాల్‌ మఖ్నీ.

మూడు ఫార్మాట్ల భవిష్య కెప్టెన్‌గా..
ఇరవై ఆరేళ్ల శుబ్‌మన్‌ గిల్‌ ఇటీవలే భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా టీమిండియా సారథిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీలో 754 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక కెప్టెన్‌గా ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు తొలి విజయం అందించిన సారథిగా గిల్‌ చరిత్రకెక్కాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత​ 2-2తో సమం చేసుకోవడంలో బ్యాటర్‌గానూ తన వంతు పాత్ర పోషించాడు. 

కాగా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్‌ శర్మ, టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌, టెస్టులకు గిల్‌ సారథ్యం వహిస్తున్నారు.

అయితే, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కలిపి గిల్‌ను నియమించేలా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అతడిని టీ20 జట్టులోకి వైస్‌ కెప్టెన్‌గా తీసుకువచ్చింది. త్వరలోనే గిల్‌ భారత వన్డే, టీ20 జట్లకు కూడా కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

చదవండి: సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్‌గా సాల్ట్‌ చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement