మా చంద్రుడి వెలుగు చూడు! | MI Trolls Arshdeep Singh With Channa Mereya Video After Tilak Varmas Revenge Knock | Sakshi
Sakshi News home page

మా చంద్రుడి వెలుగు చూడు!

May 16 2026 12:46 AM | Updated on May 16 2026 12:55 AM

MI Trolls Arshdeep Singh With Channa Mereya Video After Tilak Varmas Revenge Knock

తిలక్‌ వర్మతో ముంబై ఇండియన్స్‌ వీడియో

అర్ష్‌దీప్ సింగ్‌ ‘చీకటి’కి జవాబు

ధర్మశాల: ‘నీ చీకటి మొత్తాన్ని నేను తీసుకున్నాను. మా వెలుగులీనుతున్న చందురుడిని నీ ముందుంచాను’... అరిజిత్ సింగ్ పాడిన హిందీ సూపర్ హిట్ పాట ‘చన్నా మేరేయా’లో లైన్‌ ఇది. గురువారం పంజాబ్‌ కింగ్స్‌పై అసాధారణ బ్యాటింగ్‌తో తిలక్‌ వర్మ మ్యాచ్‌ గెలిపించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఈ పాట, అతను గెలుచుకున్న బహుమతులతో సహా వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది.

దీని వెనక నేపథ్యం ఉంది. మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రూపొందించిన ఒక వీడియో తీవ్ర విమర్శలపాలైంది. అందులో అతను తిలక్‌వర్మ నలుపు రంగులో ఉన్నాడనే ఉద్దేశాన్ని చూపిస్తూ ‘ఓయ్ అంధేరే (చీకటి)’ అంటూ అతడిని పిలిచాడు. సన్‌స్క్రీన్ వాడలేదా అంటూ ప్రశ్నిస్తూ అసలైన పంజాబీ మెరుపు రంగు ఇలా ఉంటుందంటూ నమన్‌ ధీర్‌ను చూపిస్తూ వ్యాఖ్యానించాడు. దీనికి తిలక్ ఆ సమయంలో సరైన రీతిలో జవాబివ్వలేకపోయాడు. వర్ణవివక్షను చూపించడం అర్ష్‌దీప్‌కు కొత్త కాదంటూ అన్ని వైపుల నుంచి అభిమానులు అతనిపై విరుచుకు పడ్డారు.

గతంలోనూ సాయి సుదర్శన్‌, సాకిబ్ హసన్‌ల నలుపు రంగును ఉద్దేశించి అతను ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. అయితే గురువారం తన బ్యాట్‌తోనే పంజాబ్‌ కింగ్స్‌కు జవాబిచ్చిన తిలక్ ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. అతని గెలుపు సంబరాన్ని చూస్తున్న అర్ష్‌దీప్ మొహం వాడిపోయింది! ఇదే విషయాన్ని చూపిస్తూ తిలక్ చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నట్లుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వీడియో చేసి జవాబిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement