ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాశ్ మహారాజ్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. లక్నో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన ఆకాశ్‌కు ఎట్టకేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది.
అయితే తనకు లభించిన అవకాశాన్ని ఆకాశ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన సూపర్ బౌలింగ్‌తో సీఎస్‌కే టాపర్డర్‌ను ఆకాశ్ కుప్పకూల్చాడు. ఆకాశ్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతేకాకుండా వికెట్ తీసిన ప్రతీసారి తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకాశ్ ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సీఎస్‌కేపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన లక్నో బౌలర్‌గా ఆకాశ్ నిలిచాడు. దీంతో ఎవరీ ఆకాశ్ సింగ్ అని నెటిజన్లు వెతుకుతున్నారు.
ఎవరీ ఆకాశ్ సింగ్?
ఈ లెఫ్ట్ ఆర్మ్‌పేసర్ దేశవాళీ క్రికెట్‌లో రాజస్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఆకాశ్ దిట్ట. 2020 అండర్-19 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లతో జరిగిన ఘర్షణలో ఐసీసీ శిక్షించిన ఐదుగురు ఆటగాళ్లలో ఆకాశ్ సింగ్ ఒకరు. ఆకాశ్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. లక్నో కంటే ముందు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆకాశ్ ప్రాతినిథ్యం వహించాడు. 2025 వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకుంది.
గత సీజన్‌లో 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీయడంతో 2026 సీజన్‌కు కూడా జట్టు అతడిని లక్నో అట్టిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి అతడు సత్తాచాటాడు. ముందు మ్యాచ్‌లలో అతడికి అవకాశమిచ్చింటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. ఆకాశ్ పేరిట ఓవరాల్‌గా 22 టీ20 వికెట్ల ఉన్నాయి.


