‘జెయింట్స్‌’ స్థాయి పెరిగేనా! | Lucknow Super Giants with new hopes | Sakshi
Sakshi News home page

‘జెయింట్స్‌’ స్థాయి పెరిగేనా!

Mar 25 2026 4:25 AM | Updated on Mar 25 2026 4:25 AM

Lucknow Super Giants with new hopes

కొత్త ఆశలతో లక్నో టీమ్‌

అత్యుత్తమ ప్రదర్శనపై పంత్‌ నమ్మకం 

బ్యాటింగ్‌ బలం...స్పిన్‌ బలహీనం

ఐపీఎల్‌లో ఆలస్యంగా అడుగు పెట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలి రెండు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరి ఆకట్టుకుంది. అయితే గత రెండు సీజన్లలో జట్టు ఆటతీరు పేలవంగా ఉంది. వరుసగా రెండేళ్లు కూడా టీమ్‌ ఏడో స్థానానికే పరిమితమైంది. 2025లో రికార్డు మొత్తంతో కొత్త కెప్టెన్‌గా వచ్చిన రిషభ్‌ పంత్‌ చివరి మ్యాచ్‌ మినహా టోర్నీ అంతా విఫలం కాగా... ఇతర ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉండటం జట్టును దెబ్బ తీసింది. ఐపీఎల్‌లో ఐదో సీజన్‌ ఆడబోతున్న లక్నో ఈసారైనా తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుందో లేదో వేచి చూడాలి.  – సాక్షి క్రీడా విభాగం  

తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు విజయాలు, తర్వాతి ఆరు మ్యాచ్‌లలో ఒకే ఒక్క గెలుపు! గత ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పరిస్థితి. టోర్నీని మెరుగ్గా ఆరంభించినా ఆ తర్వాత అంతా గతి తప్పింది. ఈసారి అది పునరావృతం కారాదని జట్టు పట్టుదలగా ఉంది. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, అవసరం అనుకుంటే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ కనిపించే టీమ్‌ యాజమాని సంజీవ్‌ గోయెంకా అంచనాలు, ఆశలకు అనుగుణంగా రాణించడంలో మాత్రం టీమ్‌ విఫలమవుతోంది. 

తొలి సీజన్‌ తర్వాత టీమ్‌ కిట్‌ను పూర్తిగా మార్చిన మేనేజ్‌మెంట్‌ మూడు సీజన్లు దానిని కొనసాగించింది. ఏదైనా నమ్మకాల వల్ల కావచ్చు 2026 సీజన్‌ కోసం కూడా చాలా మార్పులు చేసింది. టీమ్‌ జెర్సీని పూర్తిగా మార్చేయడంతో పాటు లోగోను కూడా కొత్తగా డిజైన్‌ చేయించింది. మైదానంలో ఈ ‘సెంటిమెంట్‌’లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది ఆసక్తికరం.  

పంత్‌పై ఆశలు... 
టాప్‌–3 విదేశీ ఆటగాళ్లతో లక్నో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. మిచెల్‌ మార్‌‡్షతో పాటు మార్క్‌రమ్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. వీరిద్దరు మంచి ఆరంభాన్ని అందిస్తే పూరన్‌ అదే ధాటిని కొనసాగించగలడు. పంత్‌ మూడో స్థానంలో ఆడటంపై చర్చ జరిగినా... ఈ ముగ్గురు బ్యాటర్లను చూస్తే పంత్‌కు నాలుగో స్థానమే ఖాయంగా కనిపిస్తోంది.    

పేసర్లతో ఫుల్‌... 
షమీ, నోర్జే, మయాంక్, అవేశ్, మొహసిన్, అర్జున్‌ టెండూల్కర్, నమన్‌ తివారి, ఆకాశ్‌ సింగ్, ప్రిన్స్, అర్షిన్, మార్‌‡్ష... రెగ్యులర్‌ బౌలర్లు, ఆల్‌రౌండర్లు కలిపి ఏకంగా 11 పేస్‌ బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు లక్నోకు అందుబాటులో ఉన్నాయి.   

స్పిన్‌ బలహీనం... 
ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లలో స్పిన్నర్లు కీలక ప్రభావం చూపించడం ఖాయం. సూపర్‌ జెయింట్స్‌ హోమ్‌ గ్రౌండ్‌ లక్నో కూడా సగటు భారత పిచ్‌ల తరహాలో పేస్‌కంటే కూడా స్పిన్‌కే కొంత అనుకూలిస్తుంది. కానీ ఈ విషయంలో లక్నో బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన స్పిన్నర్‌గా లంక ఆటగాడు హసరంగను జట్టు ఎంచుకుంది. అతనిపైనే ప్రధానంగా భారం ఉంది.    

లక్నో జట్టు వివరాలు: పంత్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, మిచెల్‌ మార్‌‡్ష, పూరన్, ఇన్‌గ్లిస్, బ్రీట్‌కే, హసరంగ, నోర్జే, హిమ్మత్, ముకుల్, అక్షత్, సమద్, షహబాజ్, అర్షిన్, బదోని, షమీ, అవేశ్‌ , సిద్ధార్‌్థ, దిగ్వేశ్‌ రాఠీ, ఆకాశ్‌ సింగ్, ప్రిన్స్, అర్జున్‌ టెండూల్కర్, నమన్‌ తివారి, మయాంక్‌ యాదవ్, మొహసిన్‌ ఖాన్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement