Legends Cricket Trophy 2023: సురేశ్ రైనా విశ్వరూపం.. 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో..!

లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 (LLC Masters) పూర్తయిన వెంటనే మరో లెజెండ్స్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఘాజియాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో నిన్న (మార్చి 22) ఇండోర్ నైట్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్లు తలపడగా.. ఇండోర్ నైట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోర్ నైట్స్.. ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 90 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది.
After LLC Masters, Suresh Raina joined the Indore Knights squad to participate in the ongoing Legends Cricket Trophy.#SureshRaina #LLCMasters #LegendsLeagueCricket #CSK https://t.co/olITh4nprx
— CricTracker (@Cricketracker) March 23, 2023
నింజాస్ బౌలర్లలో కుల్దీప్ హుడా 4 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్‌ను కుల్దీప్ హుడా (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బౌలింగ్‌లో చెలరేగిన హుడా బ్యాటింగ్‌లోనూ విజృంభించి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి నింజాస్ 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులకు పరిమితం కావడంతో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇండోర్ బౌలర్లలో కపిల్ రాణా 3, రాజేశ్ ధాబి 2, జితేందర్ గిరి, సునీల్ చెరో వికెట్ పడగొట్టారు. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (13), వీరేంద్ర సింగ్ (15), అభిమన్యు (13), రితేందర్ సింగ్ సోధి (11) విఫలం కాగా.. సత్నమ్ సింగ్ (32), ప్రిన్స్ పర్వాలేదనిపించాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన నింజాస్‌కు ఈ టోర్నీలో ఇది తొలి ఓటమి.
ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు