
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ విజేతగా లాహోర్ ఖలందర్స్ అవతరించింది. నిన్న (మే 25) జరిగిన ఫైనల్లో ఆ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత నాలుగు సీజన్లలో ఖలందర్స్‌కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. ఖలందర్స్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సికందర్ రజా సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఖలందర్స్‌ను గెలిపించాడు. 19వ ఓవర్ చివరి రెండు బంతులకు 8 పరుగులు అవసరం కాగా.. రజా వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టాడు.
అంతకుముందు కుసాల్ పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (31 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ఖలందర్స్‌ను గెలుపుకు దగ్గర చేశాడు. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో ఫకర్ జమాన్ 11, ముహమ్మద్ నయీమ్ 46, అబ్దుల్లా షఫీక్ 41, భానుక రాజపక్స 14 పరుగులు చేశారు.
గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (76) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగగా.. సౌద్ షకీల్ 4, ఫిన్ అలెన్ 12, రిలీ రొస్సో 22, అవిష్క ఫెర్నాండో 29, దినేశ్ చండీమల్ 22, ఫహీమ్ అష్రాఫ్ 28 పరుగులు చేశారు. ఖలందర్స్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, సల్మాన్ మిర్జా, హరీస్ రౌఫ్ తలో 2, సికందర్ రజా, రిషద్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.
ఆఖరి నిమిషంలో బరిలోకి దిగి ఖలందర్స్‌ను గెలిపించిన సికందర్ రజా
ముందు రోజు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించిన సికందర్ రజా.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి పది నిమిషాల ముందు ఖలందర్స్‌కు అందుబాటులోకి వచ్చాడు. తొలుత బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన రజా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఖలందర్స్‌కు టైటిల్‌ను అందించాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రజా 24 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన (7) అతను.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీతో (60) రాణించాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.