
స్వదేశంలో నమీబియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను జింబాబ్వే మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బులవాయో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా జింబాబ్వేనే గెలుపొందింది. 33 పరుగుల తేడాతో పర్యాటక జట్టును ఓడించింది. నామమాత్రపు చివరి టీ20 సెప్టెంబర్ 18న బులవాయో వేదికగా జరుగనుంది.
రాణించిన క్రుగర్, లాఫ్టీ
తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. మలాన్ క్రుగర్ (45), లాఫ్టీ ఈటన్ (47) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (37), జాన్ ఫ్రైలింక్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చివరి ఓవర్లలో నమీబియా బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకుని పెద్ద స్కోర్ చేయలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, రిచర్డ్ నగరవ తలో 2 వికెట్లు తీయగా.. మపోసా, కెప్టెన్ సికందర్ రజా చెరో వికెట్ దక్కించుకున్నారు.
చెలరేగిన బెన్నెట్.. సత్తా చాటిన మరుమణి
170 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆది నుంచి ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (40), మరుమణి (50) పోటీపడి పరుగులు రాబట్టారు.
అనంతరం బ్రెండన్ టేలర్ (29), ర్యాన్ బర్ల్ (24 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించడంతో జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో స్మిట్ 2, బెర్నాల్డ్ స్కోల్జ్, ట్రంపల్‌మన్ తలో వికెట్ తీశారు. ముసేకివా సిక్సర్ కొట్టి జింబాబ్వేను గెలిపించాడు.