
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నమీబియాతో ఇవాళ (సెప్టెంబర్ 15) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
ఆఖర్లో ర్యాన్ బర్ల్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సికందర్ రజా (11 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్ 2, ట్రంపల్‌మెన్‌కు ఓ వికెట్ దక్కింది
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయినా లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌ల్లో తలా కొన్ని పరుగులు చేశారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
నికోల్ లాఫ్టీ (38), జేన్ గ్రీన్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబానీ తలో 2 వికెట్లు తీసి నమీబియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. మసకద్జ, నగరవ, బ్రాడ్ ఈవాన్స్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 రేపు (సెప్టెంబర్ 16) జరుగనుంది.