శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర | Lahiru Udara Creates History, Becomes First Sri Lankan Opener To hit 5 sixes in an test innings | Sakshi
Sakshi News home page

శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర

Jul 4 2026 8:20 AM | Updated on Jul 4 2026 9:12 AM

Lahiru Udara Creates History, Becomes First Sri Lankan Opener To hit 5 sixes in an test innings

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఓపెనర్ లాహిరు ఉదారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. నార్త్ సౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు బాదిన అతడు.. ఓ టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లంక టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఉదారాకు ముందు ఏ ఓపెనర్‌ ఓ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టలేదు. గతంలో ఆ దేశ దిగ్గజం సనత్‌ జయసూర్య రెండు సార్లు ఓ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు కొట్టాడు.

ఈ రికార్డుతో పాటు ఉదారా ఓ భారీ శతకం కూడా సాధించాడు. 248 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 188 పరుగులు చేసి ఔటయ్యాడు. కెరీర్‌లో కేవలం మూడో టెస్టు మాత్రమే ఆడుతున్న 32 ఏళ్ల ఉదారా ఈ ఇన్నింగ్స్‌తో మరో అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు.

వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఓపెనర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిముత్ కరుణరత్నె పేరిట ఉండేది. 2015లో గాలే టెస్టులో కరుణరత్నె 186 పరుగులు చేశాడు. తాజగా ఉదారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇక ఓవరాల్‌గా ఓ టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఓపెనర్‌ రికార్డు టీమిండియా యువ కెరటం యశస్వి జైస్వాల్‌ పేరిట ఉంది. జైసూ 2024లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన టెస్టులో ఏకంగా 12 సిక్సర్లు (214 నాటౌట్‌) బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

ఆ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ చెరో 11 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఉదారా భారీ శతకంతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఉదారాకు కమిందు మెండిస్‌ (84) ‍కూడా సహకరించడంతో ఈ స్కోర్‌ సాధ్యపడింది. 

మిగతా ప్లేయర్లలో నిషన్‌ మధుష్క (​‍6), దినేశ్‌ చండీమల్‌ (1), కెప్టెన్‌ ధనంజయ డిసిల్వ (33) ఔట్‌ కాగా.. కుసాల్‌ మెండిస్‌ (0), సోనల్‌ దినుష (5) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో షమార్‌ జోసఫ్‌ 2, జేడన్‌ సీల్స్‌, అల్జరీ జోసఫ్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌ తలో వికెట్‌ తీశారు. 

కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వెస్టిండీస్‌ తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement