న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తగిన వ్యక్తి అని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. గంగూలీ తెలివితేటలు క్రికెట్ పరిపాలనలో ఉపయోగపడతాయని అతను అన్నాడు. ‘నా దృష్టిలో గంగూలీ ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. క్రికెటర్‌గా అతని ఘనతలు చూసి మాత్రమే కాకుండా గంగూలీ బుర్రను చూసి నేను అభిమానినయ్యా.
ఐసీసీ పదవిలో ఉన్నవారు ఒక దేశపు బోర్డు గురించి కాకుండా అందరి గురించి, క్రికెట్ మేలు గురించి మాత్రమే ఆలోచించాలి. అది గంగూలీ చేయగలడని నా నమ్మకం. అతని ఆలోచనా దృక్పథం అలాంటిది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందే, పరిపాలనలో, కోచింగ్‌లో రాకముందే గంగూలీ ఏమిటో నేను చూశాను. ఎంసీసీ క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఆటగాళ్లందరితో అతను సత్సంబంధాలు నెరపడం అతని సమర్థతను సూచిస్తోంది’ అని సంగక్కర వివరించాడు. త్వరలోనే ఐసీసీ చైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో గంగూలీ పేరుపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది.


