సూపరో... సూపరు

Kolkata Knight Riders beat Sunrisers Hyderabad in the Super Over  - Sakshi

 హైదరాబాద్‌ను ఓడించిన ఫెర్గూసన్‌

సూపర్‌ ఓవర్‌లో 3 బంతుల్లో 2 వికెట్లు

నైట్‌రైడర్స్‌ ఖాతాలో ఐదో విజయం

వార్నర్‌ పోరాటం వృథా  

ఉత్కంఠకు రూపం ఉంటే అది కూడా ఊపిరి బిగపట్టుకుని ఆస్వాదించేది. బంతి బంతికీ తారుమారవుతున్న ఆధిపత్యాన్ని చూసి అబ్బురపడేది. ప్రతి యేటా మండే ఎండలో అభిమానులకు క్రికెట్‌ వినోదాన్ని పంచే
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఈసారి వర్షా కాలంలో జరుగుతున్నా అభిమానులు మాత్రం చివరి బంతి వరకు తుది ఫలితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ, అనుక్షణం చోటు చేసుకుంటున్న మలుపులకు మురిసిపోతూ తన్మయత్వంతో తడిసి ముద్దవుతున్నారు.

ఇప్పటివరకు 12 ఐపీఎల్‌ సీజన్‌లు జరిగినా ఏ సీజన్‌లోనూ జరగని అత్యద్భుతం ఆదివారం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు ‘సూపర్‌ ఓవర్‌’కు దారి తీశాయి. తొలుత అబుదాబి వేదికగా జరిగిన ‘సూపర్‌’ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓడించగా... దుబాయ్‌ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ విజేత కూడా ‘సూపర్‌ ఓవర్‌’లోనే తేలింది. అయితే ఈ మ్యాచ్‌ ఫలితం ఒక సూపర్‌ ఓవర్‌లో కాకుండా రెండు సూపర్‌ ఓవర్లలో తేలడం విశేషం. 

గతంలో సూపర్‌ ఓవర్‌లోనూ రెండు జట్ల స్కోర్లు సమమైతే ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ‘సూపర్‌ ఓవర్‌’ కూడా టై కావడం... ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఫలితంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమమైతే ఏదో ఒక జట్టు గెలిచేవరకు సూపర్‌ ఓవర్‌ను ఆడించాలని  అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిబంధన తెచ్చింది. ఐపీఎల్‌లో ఆదివారం ఈ నిబంధనను అమలు చేశారు.   

అబుదాబి: బంతితో అంతా తానై ఆడించిన లాకీ ఫెర్గూసన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును గట్టెక్కించాడు. ముందు 15 పరుగులకు 3 వికెట్లు... ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లో 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్‌ పేసర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. వార్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఒత్తిడిలో తడబడి ఓటమివైపు నిలబడ్డాడు. ఆద్యంతం టన్నులకొద్దీ వినోదాన్ని పంచిన ఈ మ్యాచ్‌లో చివరకు గెలుపు కోల్‌కతావైపే నిలిచింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ మోర్గాన్‌ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో జట్టు మంచి స్కోరు అందుకుంది. అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 163 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయ్యింది. కెప్టెన్‌ వార్నర్‌ (33 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 36; 7 ఫోర్లు), విలియమ్సన్‌ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. ఫెర్గూసన్‌ (3/15) ఈ ఐపీఎల్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం అందుకున్నాడు.  
నిదానంగా మొదలై.... దూకుడుగా ముగిసి
మండే ఎండలో కోల్‌కతా ఇన్నింగ్స్‌ నెమ్మదిగానే సాగింది. తొలి మూడు ఓవర్లలో 15 పరుగులే చేసింది. తర్వాత రాహుల్‌ త్రిపాఠి 6, 4... గిల్‌ వరుసగా మూడు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో 48 పరుగులు చేసిన కోల్‌కతా త్రిపాఠి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్‌ కోసం బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నితీశ్‌ రాణా (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌))తో కలిసి గిల్‌ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. దీంతో 10 ఓవర్లకు కోల్‌కతా 77/1తో నిలిచింది. అప్పటికే కుదురుకున్న గిల్, రాణా వరుస ఓవర్లలో... ప్రియమ్‌ గార్గ్‌ అద్భుత ఫీల్డింగ్‌కు పెవిలియన్‌ బాట పట్టారు. కాసేపటికే రసెల్‌ (11 బంతుల్లో 9; 1 ఫోర్‌) కూడా వెనుదిరగడంతో కోల్‌కతా 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేయగలి గింది. ఈ దశలో మోర్గాన్, కార్తీక్‌ చెలరేగి చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్‌లో మోర్గాన్‌ 4, 6 సహాయంతో 16 పరుగులు చేసి చివరి బంతికి అవుటయ్యాడు.  

విలియమ్సన్‌ పట్టుదల...
ఫీల్డింగ్‌లో గాయపడిన విలియమ్సన్‌ ఓపెనర్‌గా వచ్చి ఆశ్చర్యపరిచాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో సింగిల్స్‌ కోసం ఆరాటపడకుండా బౌండరీల ద్వారా పరుగులు సాధించాడు. బెయిర్‌స్టో కూడా విలియమ్సన్‌కు అండగా నిలవడంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ 58 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇందులో 46 (10 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు బౌండరీల ద్వారా రావడం విశేషం. పవర్‌ప్లే తర్వాతి తొలి బంతికే విలియమ్సన్‌ను అవుట్‌ చేసి ఫెర్గూసన్‌ రైజర్స్‌ జోరుకు కళ్లెం వేశాడు.  

ఫెర్గూసన్‌ వైవిధ్యం... వార్నర్‌ పోరాటం
విలియమ్సన్‌ ఔటయ్యాక హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ తడబడింది. అద్భుత బంతితో ప్రియమ్‌ గార్గ్‌ (4)ను బౌల్డ్‌ చేసిన ఫెర్గూసన్‌ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. మరుసటి ఓవర్‌లోనే బెయిర్‌స్టోను వరుణ్‌ అవుట్‌ చేశాడు. ఈ దశలో మరోసారి బంతి అందుకున్న ఫెర్గూసన్‌ చక్కటి యార్కర్‌తో మనీశ్‌ పాండే (6)ను పెవిలియన్‌ చేర్చి రైజర్స్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా వార్నర్‌ పోరాటం ఆపలేదు. విజయ్‌ శంకర్‌ (7)తో కలిసి స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. దీంతో 15 ఓవర్లకు 109/4తో నిలిచింది. సమద్‌ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వచ్చాక ఆటలో వేగం పెరిగింది. ఉన్నంత వరకు ధాటిగా ఆడిన సమద్‌... కెప్టెన్‌పై భారాన్ని తగ్గించాడు. అప్పటివరకు బౌలింగ్‌తో బెంబేలెత్తించిన ఫెర్గూసన్‌ తెలివైన ఫీల్డింగ్‌తో సమద్‌ను అవుట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడే మ్యాచ్‌ పూర్తి మలుపు తిరిగింది.  

చివరి ఓవర్లో ఉత్కం‘టై’...
చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌ విజయానికి 18 పరుగులు కావాలి. బౌలర్‌ రసెల్‌ బంతి అందుకున్నాడు. అనుభవాన్నంతా రంగరించి ఆడుతున్న వార్నర్, అప్పుడే వచ్చిన రషీద్‌ ఖాన్‌ క్రీజులో ఉన్నారు. రసెల్‌ తొలి బంతిని నోబాల్‌ వేశాడు. ఆ తర్వాత ‘ఫ్రీ హిట్‌’ బంతిపై రషీద్‌ ఒక్క పరుగు తీసి వార్నర్‌కు స్ట్రయిక్‌ ఇచ్చాడు. వార్నర్‌ జూలు విదిల్చి వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో సన్‌రైజర్స్‌ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్న వార్నర్‌ ఆఖరి బంతికి గురి తప్పాడు. రసెల్‌ వేసిన బంతి వార్నర్‌ ప్యాడ్‌ లకు తగిలి ఆఫ్‌సైడ్‌ కు వెళ్లిపోయింది. వార్నర్, రషీద్‌ ఒక పరుగు మాత్ర మే పూర్తి చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. రెండు జట్లు సూపర్‌ ఓవర్‌కు సిద్ధమయ్యాయి.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) గార్గ్‌ (బి) రషీద్‌ 36; త్రిపాఠి (బి) నటరాజన్‌ 23; రాణా (సి) గార్గ్‌ (బి) శంకర్‌ 29; రసెల్‌ (సి) శంకర్‌ (బి) నటరాజన్‌ 9; మోర్గాన్‌ (సి) పాండే (బి) థంపి 34; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. 
వికెట్ల పతనం: 1–48, 2–87, 3–88, 4–105, 5–163.
బౌలింగ్‌: సందీప్‌శర్మ 4–0– 27–0, థంపి 4–0–46–1, నటరాజన్‌ 4–0– 40–2, విజయ్‌ శంకర్‌ 4–0–20–1, రషీద్‌ ఖాన్‌ 4–0–28–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) రసెల్‌ (బి) వరుణ్‌ 36; విలియమ్సన్‌ (సి) రాణా (బి) ఫెర్గూసన్‌ 29; గార్గ్‌ (బి) ఫెర్గూసన్‌ 4; వార్నర్‌ (నాటౌట్‌) 47; మనీశ్‌ పాండే (బి) ఫెర్గూసన్‌ 6; శంకర్‌ (సి) గిల్‌ (బి) కమిన్స్‌ 23; సమద్‌ (సి) గిల్‌ (బి) శివమ్‌ మావి 23; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1–58, 2–70, 3–70, 4–82, 5–109, 6–146.
బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–28–1,  మావి 3–0– 34–1, వరుణ్‌ 4–0–32–1, రసెల్‌ 2–0– 29–0, ఫెర్గూసన్‌ 4–0–15–3, కుల్దీప్‌ 3–0– 18–0.   

► లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి (186 మ్యాచ్‌ల్లో 5,759 పరుగులు), రైనా (193 మ్యాచ్‌ల్లో 5,368 పరుగులు), రోహిత్‌ శర్మ (197 మ్యాచ్‌ల్లో 5,158 పరుగులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
► ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించడం ఇదే ప్రథమం. గతంలో మూడుసార్లు ఆ జట్టు సూపర్‌ ఓవర్‌లో ఓడింది.
► ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ క్రికెటర్‌గా డేవిడ్‌ వార్నర్‌ నిలిచాడు. 2009లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వార్నర్‌ ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడి 5,037 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
► టోర్నీ చరిత్రలో ‘టై’ అయిన మ్యాచ్‌లు  
► ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో ఒకే సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ‘టై’గా ముగియడం ఇదే మొదటిసారి. ఈ సీజన్‌లో ఢిల్లీ –పంజాబ్‌; ముంబై –బెంగళూరు; ముంబై–పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు ‘టై’గా ముగిసి తుది ఫలితం సూపర్‌ ఓవర్‌లో వచ్చింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top