తీరు మార్చుకోని నైట్‌రైడర్స్‌.. కొనసాగుతున్న పేలవ ప్రదర్శన.. ఐపీఎల్‌లో కాస్త నయం..!

Knight Riders Franchises Continue To Grapple With Struggles In League Cricket - Sakshi

ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అనుబంధ జట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (సీపీఎల్‌) మొదలైన నైట్‌రైడర్స్‌ వైఫల్యాల పరంపర.. అమెరికా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లోనూ (ఎంఎల్‌సీ) కంటిన్యూ అవుతుంది.

2022 సీపీఎల్‌ను ఆఖరి స్థానంతో ముగించిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌.. ఆతర్వాత జరిగిన ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లోనూ (ఐఎల్‌టీ20) చివరాఖరి స్థానంలోనే (అబుదాబీ నైట్‌రైడర్స్‌) నిలిచింది. అనంతరం జరిగిన ఐపీఎల్‌-2023లో కాస్త పర్వాలేదనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (7వ స్థానం).. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలో మరోసారి తమకెంతో అచ్చొచ్చిన ఆఖరి స్థానంలో (లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌) నిలిచి, లీగ్‌ దశలోనే పోటీ నుంచి నిష్క్రమించింది.

సునీల్‌ నరైన్‌ సారధ్యంలో ఎంఎల్‌సీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన నైట్‌రైడర్స్‌ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, టేబుల్‌ టాపర్‌ సియాటిల్‌ ఆర్కాస్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా నైట్‌రైడర్స్‌ అతికష్టం మీద నెగ్గింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నైట్‌రైడర్స్‌ ఈ మ్యాచ్‌లో గెలవగలిగింది. 6 జట్లు పాల్గొన్న ఎంఎల్‌సీ-2023 సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది.

కాగా, నైట్‌రైడర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రాంచైజెస్‌ను బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, నటి జూహి​ చావ్లా, వ్యాపారవేత్త జై మెహతా, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌  సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే, అయినా..!
లీగ్‌ క్రికెట్‌లో నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీల ప్రస్తానాన్ని గమనిస్తే, అన్ని జట్లలో ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లు మెజారిటీ శాతం ఉన్నారు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ వరకు అన్ని నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. 

సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌లో కీరన్‌ పోలార్డ్‌, మార్టిన్‌ గప్తిల్‌, సునీల్‌ నరైన్‌, నికోలస్‌ పూరన్‌, డ్వేన్‌ బ్రేవో, రిలీ రొస్సో, ఆండ్రీ రసెల్‌ ఉండగా.. 

ఐపీఎల్‌లో నితీశ్‌ రాణా, రింకూ సింగ్‌, జేసన్‌ రాయ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, రహ్మానుల్లా గుర్భాజ్‌, జాన్సన్‌ చార్లెస్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తదితరులు ఉన్నారు. 

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ విషయానికొస్తే.. ఈ జట్టులో సునీల్‌ నరైన్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, బ్రాండన్‌ కింగ్‌, ఆండ్రీ రసెల్‌ లాంటి హార్డ్‌ హిట్టర్లు ఉండగా..

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో జేసన్‌ రాయ్‌, రిలీ రొస్సో, మార్టిన్‌ గప్తిల్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌ తదితరులు నైట్‌రైడర్స్‌ జట్టులో ఉన్నారు. 

ప్రతి నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీలో ఈ స్థాయిలో మ్యాచ్‌ విన్నర్లు ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజీ ఏ లీగ్‌లోనూ ఛాంపియన్‌ కాలేకపోతుంది. కనీసం టాప్‌ జట్లలో ఒకటిగా కూడా నిలువలేకపోతుంది. ఐపీఎల్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన నైట్‌రైడర్స్‌ ఆ తర్వాత ఏ లీగ్‌లోనూ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. దీంతో నైట్‌రైడర్స్‌  ఫ్యాన్స్‌ తెగ హర్టై పోతున్నారు.

మరో పక్క ఇదే ఫ్రాంచైజీ క్రికెట్‌లో సూపర్‌ కింగ్స్‌ జట్లు మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ లీగ్‌లో అయినా ఆ జట్టు మినిమం గ్యారెంటీగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top