బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియా కెప్టెన్‌కు గాయం..?

KL Rahul Suffers Injury During Net Practice Ahead Of 2nd Bangladesh Test - Sakshi

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌ అందింది. ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడినట్లు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ స్వయంగా ప్రకటించాడు. నెట్స్‌లో రాహుల్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా రాహుల్‌ చేతికి బంతి బలంగా తాకిందని, నొప్పి భరించలేక రాహుల్ సెషన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడని రాథోడ్‌ తెలిపాడు. అయితే, గాయం అంత తీవ్రమైంది కాదని, రెండో టెస్ట్‌లో రాహుల్‌ తప్పక బరిలోకి దిగుతాడని డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం రాథోడ్‌ వివరణ ఇచ్చాడు. 

కాగా, తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్‌ మ్యాచ్‌కు దూరం కావాల్సి వస్తే.. టీమిండియా సారథ్య బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాహుల్‌ గైర్హాజరీలో అతని డిప్యూటీగా ఎంపికైన పుజారా ఆ బాధ్యతలు చేపడతాడా లేక అనుభవజ్ఞుడైన కోహ్లికి ఆ బాధ్యతలు అప్పజెప్పుతారా అని అభిమానులు డిస్కస్‌ చేసుకుంటున్నారు.

బంగ్లాతో రెండో వన్డే సందర్భంగా రెగ్యలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడటంతో తదనంతర పర్యటనలో కేఎల్‌ రాహుల్‌కు టీమిండియా పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. రాహుల్‌ నేతృత్వంలో టీమిండియా మూడో వన్డేలో, అలాగే తొలి టెస్ట్‌లో ఘన విజయాలు నమోదు చేసింది. 

ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్‌లో పుజారా టీమిండియా పగ్గాలు చేపడితే ఈ ఏడాది భారత 8వ కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ ఏడాది ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ భారత కెప్టెన్లుగా వ్యవహరించారు.

కెప్టెన్‌ సరే రాహుల్‌ స్థానంలో ఎవరు..?
గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరమైతే, అతని స్థానంలో పుజారానో లేక కోహ్లినో ఆ బాధ్యతలు చేపడతారు. మరి, రాహుల్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ప్రస్తుతం ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. రాహుల్‌ స్థానం‍లో మేనేజ్‌మెంట్‌ అభిమన్యు ఈశ్వరన్‌కు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఈశ్వరన్‌.. బంగ్లా పర్యటనలో భారత ఏ జట్టు తరఫున 2 భారీ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్‌ గైర్హాజరీలో గిల్‌తో పాటు ఈశ్వరన్‌ ఓపెనింగ్‌ చేయవచ్చు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top